ఇందిరా గాంధీనే ఆనాడు అలా మాట్లాడలేదు.. కాంగ్రెస్‌ ఏం సమాధానం చెబుతుంది?: అమిత్‌ షా

18 Mar, 2023 16:13 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు చర్చించేందుకు ముందుకు వస్తేనే.. పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగేందుకు ఆస్కారం ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఇండియా టుడే కన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

స్పీకర్‌ సమక్షంలో ఇరు వర్గాలు కూర్చుని చర్చించాలి. పార్లమెంటరీ వ్యవస్థ కేవలం ఖజానాతో లేదంటే ప్రతిపక్షంతో మాత్రమే నడవదని హోంమంత్రి అన్నారు. ఇరు వర్గాలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. అప్పుడే వాళ్లు తమకు దక్కట్లేదని గగ్గోలు పెడుతున్న వాక్‌ స్వాతంత్రం వాళ్లకు దక్కినట్లవుతుంది. ఈ విషయంలో వాళ్లు రెండడుగులు ముందుకు వేస్తేనే.. మేం కూడా రెండడుగులు ముందుకు వేయగలం. అప్పుడే పార్లమెంట్‌ సజావుగా నడుస్తుంది. కానీ, వాళ్లు కేవలం మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు.  ఏం లాభం.. ఇలా జరగకూడదు కదా అని అభిప్రాయపడ్డారాయన. 

ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ లండన్‌ కేంబ్రిడ్జి ప్రసంగంపైనా షా తన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా  మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ప్రస్తావన తీసుకొచ్చారాయన. దేశంలో ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ ఇంగ్లండ్‌లో పర్యటించారు. ఆ సమయంలో షా కమిషన్‌ ఏర్పాటయ్యింది. ఆమెను జైల్లో పెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు ఇంగ్లండ్‌లో ఓ జర్నలిస్ట్‌ ఆమెను.. మీ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగారు.

దానికి ఆమె ‘మా దేశంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ, వాటి గురించి ఇక్కడ నేను మాట్లాడదల్చుకోలేదు. నా దేశంలో అంతా సవ్యంగానే ఉంది. నా దేశం గురించి ఏం మాట్లాడదల్చుకోలేదు. ఇక్కడికి నేను ఒక భారతీయురాలిగా వచ్చా అని ఆమె బదులిచ్చారు.. అని షా చెప్పుకొచ్చారు.  అలాగే.. మాజీ ప్రధాని వాజ్‌పేయి సైతం ప్రతిపక్షంలో ఉండగా.. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే అవకాశం దక్కిందాయనకు. ఆ టైంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. అయినా కూడా అక్కడ రాజకీయాల ప్రస్తావన రాలేదు. కేవలం కశ్మీర్‌ అంశంపై చర్చ కోసమే ఆయన్ని పిలిచారు. ఆయనా దాని గురించే మాట్లాడారు కూడా. ఇలాంటి సంప్రదాయం రాజకీయాల్లో ప్రతీ ఒక్కరూ పాటించాలని నేను కోరుకుంటా. 

అలాకాకుండా.. విదేశాలకు వెళ్లి భారత్‌ గురించి, ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థపైనా ఆరోపణలు చేస్తామా? ఇతర దేశాల చట్ట సభలకు వెళ్లి భారత్‌ గురించి ప్రతికూల కామెంట్లు చేస్తామా?.. కాంగ్రెస్‌ పార్టీ దీనికి  సమాధానం చెప్పాల్సిన అవసర ఉందని పేర్కొన్నారాయన.

ఒకవైపు రాహుల్‌ గాంధీ లండన్‌ ప్రసంగంపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తోంది. మరోవైపు అదానీ-హిండెన్‌బర్గ్‌ వ్యవహారంలో జేపీసీ ఏర్పాటుకై డిమాండ్‌ చేస్తోంది కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు. ఇరు పార్టీల ఆందోళనల నడుమ.. బడ్జెట్‌ రెండో దఫా పార్లమెంట్‌ సమావేశాలు వారం నుంచి సజావుగా సాగకుండా వాయిదా పడుతూ వస్తున్నాయి. 

ఇదీ చదవండి: రాహుల్‌ గాంధీ.. భారత వ్యతిరేకి!

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు