భక్తి ఉద్యమంతో సామాజిక పరివర్తన: అమిత్‌ షా

26 Dec, 2020 16:40 IST|Sakshi

అసోంలో అమిత్‌ షా పర్యటన

గువాహటి: భక్తి ఉద్యమ పునరుద్ధరణతో అసోంలోని గ్రామాల్లో సామాజిక పరివర్తన తీసుకువస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. తద్వారా యువత ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోతారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సంప్రదాయ వైష్ణవ మఠాల్లోని నమ్‌ఘర్లకు కేంద్రం ఆర్థిక సాయం అందిస్తోందని, తద్వారా ఒక్కొక్కరికి రెండున్నర లక్షల రూపాయల చొప్పున మొత్తంగా 8 వేల మందికి లబ్ది చేకూరుతుందని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల రెండు రోజుల పర్యటనలో భాగంగా అమిత్‌ షా శనివారం, కామరూప్‌ జిల్లాలోని అమిగావ్‌కు చేరుకున్నారు. అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘వేర్పాటు వాదులు పరిపాలిస్తున్న సమయంలో యువత చేతికి ఆయుధాలు ఇచ్చారు. 

కానీ ఇప్పుడు ఆ గ్రూపులన్నీ జనజీవన స్రవంతిలో కలిసిపోయాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో అసోం కూడా భాగమైంది. ఇక్కడ సాధించిన అతిపెద్ద విజయం బోడోలాండ్‌లో నమోదైంది. ఇటీవల అక్కడ జరిగిన ఎన్నికల్లో 80 శాతం పోలింగ్‌ నమోదైంది. ఒక్క చెదురుముదురు ఘటన కూడా చోటుచేసుకోలేదు. ఒక్క రక్తపు బొట్టు కూడా చిందలేదు. అయితే బోడోలాండ్‌ గెలుపు సెమీ ఫైనల్‌ మాత్రమే. ఇప్పుడు అంతిమ పోరుకు సిద్ధం కావాల్సి ఉంది. అసోం ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ సాధించాలి. సోనోవాల్‌- హిమంత నేతృత్వంలో ఇప్పటికే ఇక్కడ ఎన్నో అద్భుతాలు చోటుచేసుకున్నాయి. ఇక ముందు కూడా అదే కొనసాగుతుంది’’ అని అమిత్‌ షా పేర్కొన్నారు. 2021లో జరుగనున్న  అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.(చదవండి: ఎల్లప్పుడూ నన్ను అవమానించేలా: ప్రధాని మోదీ )

ఇక కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు ఎక్కుపెట్టిన అమిత్‌ షా.. ‘‘మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అసోం నుంచి 18 ఏళ్లపాటు ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. కానీ రాష్ట్రానికి దక్కాల్సిన రూ. 8 వేల ఆయిల్‌ రాయల్టీ సమస్యను పరిష్కరించలేకపోయారు. మేం దానిని పూర్తి చేశాం’’ అని స్థానికులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాగా తన పర్యటనలో భాగంగా సాంస్కృతిక, పర్యాటక అభివృద్ధికై ఉద్దేశించిన బటాద్రవ ధన్‌తో పాటు గువాహటిలో ఒక మెడికల్‌ కాలేజీ, తొమ్మిది లా కాలేజీల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

మరిన్ని వార్తలు