జూలై–ఆగస్టులో వ్యాక్సినేషన్‌ వేగం పుంజుకుంటుంది 

22 Jun, 2021 08:08 IST|Sakshi

అహ్మదాబాద్‌: జూలై–ఆగస్టు నెలల్లో వ్యాక్సినేషన్‌ వేగం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని హోంమంత్రి అమిత్‌షా సోమవారం పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లోని ఓ వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ ఉచిత వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 18–44 వయసుల వారికి ఉచితంగా వ్యాక్సినేషన్‌ చేయాలన్న నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

భారత్‌లాంటి పెద్ద దేశంలో ఉచిత వ్యాక్సిన్‌ నిర్ణయం చాలా పెద్ద నిర్ణయమని చెప్పారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వ్యాక్సినేషన్‌ వేగం పెరుగుతుందని తెలిపారు. కోవిడ్‌తో పోరాడేందుకు వ్యాక్సినేషన్‌ కీలకంగా మారనుందని చెప్పారు. ప్రజలంతా ముందుకొచ్చి వెంటనే వ్యాక్సినేషన్‌ చేసుకోవాలని సూచించారు. ఒక డోసు వ్యాక్సిన్‌ తీసుకున్న వారు రెండో డోసును కూడా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తీసుకోవాలని తెలిపారు. 18–44 వయసున్న వారికి వ్యాక్సినేషన్‌ వేగంగా అందించేందుకు స్పాట్‌ రిజిస్ట్రేషన్‌ సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

చదవండి: రూ.4 లక్షల నష్టపరిహారంపై సుప్రీం తీర్పు రిజర్వ్‌

మరిన్ని వార్తలు