సంక్షోభంలో బొమ్మై ప్రభుత్వం?.. రంగంలోకి అమిత్‌ షా

3 May, 2022 09:50 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కర్ణాటకలో ఆకస్మిక పర్యటన సొంత పార్టీతో పాటు అంతటా చర్చనీయాంశమైంది. అమిత్‌షా నేడు మంగళవారం జరిగే బసవ జయంతి ఉత్సవంలో పాల్గొంటారు. ఇందులో సీఎం బొమ్మై, పార్టీ అగ్రనేతలు, మంత్రులు కూడా ఉంటారు. అనంతరం అమిత్‌ షా ఆర్టీ నగరలోని సీఎం బొమ్మై ఇంటికి వెళ్తారు. మధ్యాహ్నం సీఎం నివాసంలోనే రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం.  

వరుస సమస్యల నేపథ్యంలో  
గత నెల రోజుల్లో రెండుసార్లు సీఎం బొమ్మై ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితితో పాటు సర్కారు సమస్యలను కూడా ఏకరువు పెట్టినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణపై కూడా బొమ్మై ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో దక్షిణాదిలో అధికారం ఉన్న ఏకైక రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవడంతో పాటు సర్కారులోని లుకలుకలను పరిష్కరించడానికి ఏకంగా అమిత్‌ షా రంగంలోకి దిగినట్లు సమాచారం. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం పేరుతో ఆయన ఆకస్మిక పర్యటనకు నాంది పలికినట్లు తెలుస్తోంది. 

కొంతకాలంగా వరుసగా ఏదో ఒక కుంభకోణం బొమ్మై ప్రభుత్వాన్ని ఇరుకునపెడుతోంది. కొన్నినెలల కిందట బిట్‌కాయిన్‌ స్కాం, తాజా ఎస్‌ఐ పరీక్షల కుంభకోణం, ఆ మొన్న కాంట్రాక్టరు ఆత్మహత్య వల్ల సీనియర్‌ మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేయడం తదితరాలు పార్టీ హైకమాండ్‌ను ఆలోచనలో పడేశాయి. దీంతో మొదట ఇంటిని చక్కదిద్దుకోవాలని నిశ్చయించింది. పార్టీలో, ప్రభుత్వంలో ముఖ్యమైన మార్పులు, కొత్తగా చేరికలు, ప్రచార కార్యక్రమాలపై అమిత్‌ షా దిశా నిర్దేశం చేయనున్నారు. ఫలితంగా పార్టీ నేతల్లో టెన్షన్‌ నెలకొంది. 

పాలనలో మార్పులు తెస్తాం : సీఎం
రానున్న రోజుల్లో పరిపాలనలో పెనుమార్పులు తీసుకొస్తామని సీఎం బసవరాజ బొమ్మై చెప్పారు. సోమవారం విధానసౌధలో జరిగిన సాంఘిక సంక్షేమ శాఖ సామర్థ్య అభివృద్ధి సెమినార్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో అట్టడుగులో ఉన్న వ్యక్తికి పథకాలు చేరాలి, అప్పుడే ప్రజాప్రభుత్వ ఆశయాలు నెరవేరుతాయన్నారు. కాగా, కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలోకి చేర్చుకొంటామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ చెప్పడం అవివేకమని విమర్శించారు. మహారాష్ట్రలో కన్నడభాషను అధికంగా మాట్లాడే ప్రాంతాలను గుర్తించి వాటిని కర్ణాటకలోకి చేర్చుకోవడంపై తాము కూడా సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు బొమ్మై చెప్పారు. 

(చదవండి: కర్ణాటక సీఎంను మళ్లీ మార్చబోతున్నారా?)

మరిన్ని వార్తలు