భారత్‌లో ఆమ్నెస్టి కార్యకలాపాలు బంద్‌

30 Sep, 2020 03:33 IST|Sakshi

కేంద్రం వెంటాడి వేధిస్తోందని తీవ్ర ఆరోపణలు 

బ్యాంకు ఖాతాలు స్తంభింపజేసిందని వెల్లడి

చట్టవిరుద్ధంగా విదేశీ నిధులు వస్తున్నాయంటున్న కేంద్రం

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టి ఇంటర్నేషనల్‌ భారత్‌లో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. భారత ప్రభుత్వం తమను వెంటాడి వేధిస్తోందని తీవ్రమైన ఆరోపణలు చేసింది. బ్యాంకు ఖాతాలన్నీ ఫ్రీజ్‌ చేయడంతో సిబ్బందిని బలవంతంగా విధుల నుంచి తొలగించాల్సి వచ్చిందని మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే కేంద్ర ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ఆమ్నెస్టికి విదేశీ నిధులు చట్ట విరుద్ధంగా వస్తున్నాయని, ఆ సంస్థ ఫారెన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద రిజిస్టర్‌ చేసుకోలేదని చెబుతోంది.

‘‘ఆమ్నెస్టి ఇంటర్నేషనల్‌ ఇండియా బ్యాంకు ఖాతాలన్నీ స్తంభించి పోయాయి. సెప్టెంబర్‌ 10న నుంచి అన్ని అకౌంట్లు ఫ్రీజ్‌ చేశారు. దీంతో మా సంస్థ చేపట్టే పనులన్నీ ఆగిపోయాయి. సిబ్బందిని తొలగించాల్సి వచ్చింది.’’అని ఆమ్నెస్టీ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. రెండేళ్లుగా కేంద్రం వేధింపులు కేంద్రం తమ సంస్థని రెండేళ్లుగా వేధిస్తోందని ఆమ్నెస్టి ఇంటర్నేషనల్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అవినాశ్‌ కుమార్‌ ఆరోపించారు.  ఢిల్లీ ఘర్షణలు, ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత  కశ్మీర్‌లో  అల్లర్లలో మానవ హక్కులకు విఘాతంపై తమ సంస్థ ప్రశ్నలు సంధించిందని, ఫలితంగా బ్యాంకు అకౌంట్లు ఫ్రీజ్‌ జరిగిందన్నారు.  

ఆమ్నెస్టి అనుబంధ సంస్థపై విచారణ 
ఆమ్నెస్టి ఇంటర్నేషనల్‌ స్వచ్ఛంద సంస్థపై ఈడీ విచారణ చేయడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ సంస్థకు అనుబంధంగా ఉన్న ప్రైవేటు కంపెనీ  ఆమ్నెస్టి ఇంటర్నేషనల్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ అండ్‌ ఇండియన్స్‌ ఫర్‌ ఆమ్నెస్టి ఇంటర్నేషనల్‌ ట్రస్ట్‌ని మనీ ల్యాండరింగ్, ఫారెన్‌ ఎక్స్‌ఛేంజ్‌ నిబంధనల ఉల్లంఘనల కింద విచారిస్తున్నట్టుగా తెలిపాయి. అనుమతుల్లేకుండానే అందుకున్న రూ.51 కోట్లపై విచారిస్తున్నట్టు తెలిపింది.

ఆరోపణలు దురదృష్టకరం
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆరోపణల్ని  హోంశాఖ తిప్పికొట్టింది. ఆ ఆరోపణలు అవాస్తవం, అత్యంత దురదృష్టకరమని  పేర్కొంది. భారత చట్టాలను ఉల్లంఘించి నిధులు తెచ్చుకుంటున్న ఆ సంస్థ తాము చేస్తున్న పనుల నుంచి దృష్టి మరల్చడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని పేర్కొంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా ఆమ్నెస్టీకి నిధులు అందుతున్నాయని, స్వచ్ఛంద సంస్థలకు అలా నిధులు రావడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. యూకే నుంచి 1.60 కోట్ల నిధుల కోసం 2011–12లో అప్పటి ప్రభుత్వం ఆమ్నెస్టీకి అనుమతులి చ్చిందని, 2013 నుంచే యూపీఏ హయాంలోనే అనుమతులు నిలిచి పోయాయని వెల్లడించింది.

మరిన్ని వార్తలు