ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నిర్ణయం

29 Sep, 2020 11:23 IST|Sakshi

భారత దేశంలో కార్యకలాపాలు నిలిపివేస్తున్నాం : ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్

 ప్రభుత్వం బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది

సిగ్గు సిగ్గు అంటున్న మానవహక్కుల నేతలు

సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత దేశంనుంచి తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిందని అమ్నెస్టీ ఇండియా ఆరోపించింది. 2020 సెప్టెంబర్ 10న తన బ్యాంకు ఖాతాలన్నీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా స్తంభింపజేసిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. దీంతో తీవ్ర వేదన, దుఃఖం, భారమైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. ప్రభుత్వ ప్రతీకార చర్యల కారణంగానే తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని తెలిపింది. అవాస్తవాలు, ఉద్దేశపూరక ఆరోపణలపై మానవ హక్కుల సంస్థలను భారత ప్రభుత్వం మంత్ర గత్తెలా వేటాడుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది.

తాము దేశంలో పరిస్థితిని ఎదుర్కొంటున్నామని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా తాజాగా ఆరోపించింది. దేశంలో మానవ హక్కులు ఉల్లంఘనలపై తాము సమర్పించిన నివేదికల నేపథ్యంలో తమ సభ్యులు, బెదిరింపులు, వేధింపుల దాడిని ఎదుర్కొంటున్నారని గ్రూప్ సీనియర్ రీసెర్చ్, అడ్వకేసీ అండ్ పాలసీ డైరెక్టర్ రజత్ ఖోస్లా చెప్పారు. మానవహక్కుల ఉల్లంఘనపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమివ్వడం ప్రభుత్వానికి ఇష్టం లేదని పేర్కొన్నారు. ప్రధానంగా ఢిల్లీ అల్లర్లు, జమ్ముకశ్మీర్ అంశాలపై మౌనం వహించిదని ఆరోపించారు. ఇలాంటి ధోరణుల మధ్య దేశంలో ఇక  సేవలు అందించలేమని తెలిపింది. 70కి పైగా దేశాలలో పనిచేస్తున్నాం ఇంతకుముందు 2016 లో రష్యా మాత్రమే కార్యకలాపాలను మూసివేశాని ఖోస్లా చెప్పారు. అయితే దేశంలో తన చట్టపరమైన కేసులపై తమపోరాటం కొనసాగిస్తామన్నారు.  ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీన్ని గమనిస్తారని ఆశిస్తున్నామన్నారు.

ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ -2010 (ఎఫ్‌సీఆర్ఏ) నిబంధనలను ఉల్లంఘించారన్న కారణంగా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియాపై 2019 నవంబర్ 5న  సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. సంస్థ ప్రధాన కార్యాలయంపై  దాడులు నిర్వహించింది. అలాగే గత ఏడాది ఈడీ ప్రత్యేక దర్యాప్తును ప్రారంభించిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ ఆరోపణలతో తాజాగా ఇండియాలో ఆమ్నెస్టీ బ్యాంకు ఖాతాలను సీజ్ చేయడంతో తాజా పరిణామం చోటు చేసుకుంది కాగా భారతదేశంలో భావప్రకటన స్వేచ్ఛపై, అసమ్మతి గళాలపై ఒత్తిడి, దాడులపై పెరుగుతున్న ఆందోళనల మధ్య ఆమ్నెస్టీ తాజా నిర్ణయం కలకలం రేపింది. దీంతో దేశ ప్రతిష్టకు తీవ్ర భంగం ఏర్పడిందని మానవ హక్కుల  కార్యకర్తలు అంటున్నారు.  ప్రజాస్వామ్య స్ఫూర్తికి తీరని అవమానమని వ్యాఖ్యానిస్తున్నారు.  

మరిన్ని వార్తలు