రణరంగంగా అమృత్‌సర్‌.. బారికేడ్లు తోసుకుని తల్వార్‌లతో పోలీస్‌ స్టేషన్‌కు!

23 Feb, 2023 17:16 IST|Sakshi

ఛండీగఢ్‌:  చారిత్రక నగరం అమృత్‌సర్‌.. ఇవాళ(గురువారం) రణరంగాన్ని తలపించింది.  వందలాది మంది నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఓ మతబోధకుడి వ్యక్తిగత అనుచరుడి అరెస్ట్‌ను నిరసిస్తూ.. మద్దతుదారులు బారికేడ్లు తొలగించి మరీ పోలీస్‌ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. భారీగా బల ప్రదర్శనతో అమృత్‌సర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

వారిస్ పంజాబ్ దే గ్రూప్ చీఫ్ అమృత్‌పాల్ సింగ్. ఆయన ముఖ్య అనుచరుడు లవ్‌ప్రీత్ సింగ్‌ను పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు. ఆ అరెస్ట్‌ను ఖండిస్తూ గ్రూప్‌కు చెందిన వందలాది మంది మద్దతుదారులు గురువారం భారీ ప్రదర్శన నిర్వహించారు. అజ్‌నాలా పోలీస్ స్టేషన్ బయట ఉన్న ఫెన్సింగ్‌ను దాటి వెళ్లారు. అడ్డుగా ఉంచిన బారికేడ్లను బలవంతంగా తొలగించారు.

కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తన అనుచరుడు లవ్‌ప్రీత్‌ సింగ్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారని వారిస్ పంజాబ్ దే గ్రూప్ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ ఆరోపించాడు. ఒక్క గంటలో కేసును వెనక్కి తీసుకోకపోతే జరిగే పరిణామాలకు అధికారులదే బాధ్యత అని హెచ్చరించాడు. తామేమీ చేయలేమని అధికారులు, పోలీసులు భావిస్తున్నారిన, కానీ, తామేంటో చూపించేందుకే ఈ బలప్రదర్శన చేపట్టినట్లు చెప్పాడు.

మరోవైపు అజ్‌నాలా పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పోలీస్‌ బలగాలను మోహరించారు. వారిస్ పంజాబ్ దే గ్రూప్‌నకు చెందిన నిరసనకారులను నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

మరిన్ని వార్తలు