‘ఆయనకు ట్రాక్టర్‌ అందించడం మాకు గౌరవం’

19 Sep, 2020 20:53 IST|Sakshi

పట్నా: ఊరి బాగుకోసం 30 ఏళ్లు కష్టపడి నీటి కాలువ తవ్విన బిహార్‌లోని లంగీ భుయాన్‌పై మహింద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహింద్రా ప్రశంసలు కురిపించారు. భుయాన్‌ తవ్విన కాలువ పిరమిడ్స్‌, తాజ్‌మహల్‌ వంటిదని అన్నారు. ఆయన కృషికి చిరు బహుమానంగా ట్రాక్టర్‌ ఇవ్వనున్నట్టు ట్విటర్‌లో ప్రకటించారు. ఆ పెద్దాయనకు తమ మహింద్రా ట్రాక్టర్‌ను అందించడం గౌరవంగా భావిస్తామని పేర్కొన్నారు. కాగా, బిహార్‌లోని గయ ప్రాంతంలోని కోటీలావ గ్రామానికి చెందిన వ్యక్తి లంగీ భుయాన్.. ఆ ఊరి కొండలపై కురిసిన వాననీరు వృథా పోకుండా 30 ఏళ్ల క్రితం ఓ బృహత్తరమైన ఆలోచన చేశాడు. కొండ దగ్గర నుంచి కాలువ తవ్వి వర్షం నీరును ఊరికి తరలిద్దామనుకున్నాడు. 


అనుకున్నదే తడవుగా పనులు ప్రారంభించాడు. అప్పుడు మొదలైన కాలువ తవ్వకం తాజాగా పూర్తయింది. అయితే, భుయాన్‌ కష్టానికి గ్రామస్తులు పెద్దగా సాయం చేయలేదు. ఒక్కడే 3 కిలోమీటర్ల పొడవునా కాలువ తవ్వి తన ఊరికి అందించాడు. దీంతో అక్కడ పంట పొలాలన్నింటికీ ఆ నీరే ఆధారమవుతోంది. ఇన్నేళ్ల అతని ప్రయత్నం సఫలం కావడంతో గ్రామస్తులందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈక్రమంలోనే రోహిన్‌ వర్మ అనే వ్యక్తి భుయాన్‌ను ఆదుకోవడం ఆనంద్‌ మహింద్రా అదృష్టంగా భావిస్తారనుకుంటా అని ఆయన్ని ట్యాగ్‌ చేశాడు. 
(చదవండి: ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా?)

అప్పటికే భుయాన్‌ గొప్పతనంపై ట్విటర్‌లో స్పందించిన ఆనంద్‌ మహింద్రా.. ఆ పెద్దాయనకు ట్రాక్టర్‌ ఇస్తానని రిప్లై ఇచ్చాడు. ఇదిలాఉండగా.. బిహార్‌కు చెందిన దశరథ్ మాంఝీ అనే వ్యక్తి  కొం‍డచర్యలు విరిగిపడి తన భార్య మరణించడంతో ఒక్కడే ఒక కొండను తొలచి గ్రామానికి రహదారి నిర్మించిన విషయం తెలిసిందే. 22 ఏళ్లు కష్టపడి ఒక్కడే ఈ పనిని చేయడంతో ఈ విషయం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత మాంఝీ కథతో సినిమా కూడా తెరకెక్కింది. 
(చదవండి: సామాన్యుడి 30 ఏళ్ల కృషి, ఆ ఊరికి వరప్రదాయిని)

మరిన్ని వార్తలు