Anand Mahindra Tweet: ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌లో పొరపాటు.. ‘నేను అమ్మాయిని కాను’

27 Aug, 2021 15:56 IST|Sakshi

ఎప్పుడూ ఫన్నీ వీడియోలు, స్పూర్తినిచ్చే పోస్టులతో నెటిజనులను ఆశ్చర్యపరిచే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా సోషల్‌ మీడియాలో మరో వీడియోను షేర్‌ చేశారు. గురువారం ఓ బాలుడు ప్రాచీన యుద్ధ విద్య కలరిపయట్టు నేర్చుకుంటున్న వీడియోను తన ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోలో తొమ్మిదేళ్ల బాలుడు చేతిలో కర్రను పట్టుకొని అవలీలగా కలరిపయట్టు సాధన చేస్తున్నాడు. అతన్ని కేరళలోని ఏక వీర కలరిపయట్టు అకాడమీ విద్యార్థి నీలకందన్‌ నాయర్‌గా గుర్తించారు. అయితే ఈ పోస్టులో ఆనంద్‌ మహీంద్రా ఓ చిన్న తప్పిదం చేశారు. వీడియోలో కలరిపయట్టు చేస్తున్న పిల్లవాడిని అమ్మాయనుకొని పొరపాటుగా ‘బాలిక’గా పేర్కొన్నారు ‘హెచ్చరిక ఈ యువతి దారిలోకి రాకండి. క్రీడా రంగంలో కలరిపయట్టుకు మరింత ప్రాధాన్యత అందించాలి. అప్పుడే ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించలదు అని పేర్కొన్నారు. 

కాగా ఆనంద్‌ మహీంద్రా తప్పుగా ట్వీట్‌ చేసినప్పటికీ ఈ వీడియోను చూసిన నెటిజన్లు సంబరపడిపోతున్నారు. బాలుడి నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారు. నిజానికి ఆనంద్ మహీంద్రా పోస్ట్‌పై నీలకందన్ కూడా స్పందించాడు. ‘మీ మద్దతు, ప్రోత్సాహానికి చాలా ధన్యవాదాలు సర్. కానీ ఒక చిన్న దిద్దుబాటు.. నేను అమ్మాయిని కాదు, 10ఏళ్ల అబ్బాయిని. కలరిపయట్టు విద్యలో ఒక షార్ట్ మూవీలో నటించడం కోసం నా జుట్టు పొడవుగా పెంచుతున్నాను’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా కలరిపయట్టు ఆధునిక కేరళలో ఒక పురాతన యుద్ధ కళారూపం. కళరిపయట్టు దీనినే కలరి అని కూడా పిలుస్తారు. కర్రలు, కత్తులు, కవచాలను ఉపయోగించి చేసే ఇది భారత్‌లో ఇప్పటికీ కొనసాగుతున్న పురాతన మార్షల్‌ ఆర్ట్‌. 
చదవండి: విమానంలో సిగరెట్‌ తాగిన యువతి.. ప్రయాణికులు షాక్‌

>
మరిన్ని వార్తలు