ఈ వైరల్‌ ఫోటోపై ఆనంద్‌ మహీంద్ర అసహనం

8 Apr, 2021 16:58 IST|Sakshi

ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తరచూ సరదా సంఘటనలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. అందులో నవ్వించేవి, ఆలోచింపజేసేవి, వర్తమాన అంశాలు.. ఇలా చాలా ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరూ చర్చించుకునే అంశం కరోనా వైరస్. దానికి అడ్డుకట్ట వేసేందుకు మాస్కులు ధరించండి, భౌతిక దూరం పాటించండంటూ ప్రభుత్వాలు, వైద్య నిపుణులు కోరుతున్నారు. ఆనంద్‌ మహీంద్రా షేర్ చేసిన చిత్రంలోని వ్యక్తులకు ఆ విషయాలేవీ చెవికెక్కినట్టు లేదు. అందుకే భౌతిక దూరానికి కూడా షార్ట్ కట్ వెతుకున్నారని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.  

కార్యాలయాల్లో ఉద్యోగులు, ప్రజలకు మధ్య ఉండే గ్లాస్‌ వాల్‌కు సంభాషణ నిమిత్తం ఓ రంధ్రం లాంటి ఏర్పాటు ఉంటుంది కదా! అయితే, బయటి వ్యక్తి ఒకరు ఆ రంధ్రంలో తలపెట్టి లోపల కూర్చున్న సిబ్బంది ఒకరితో మాట్లాడుతున్న చిత్రాన్ని ఆనంద్‌ మహీంద్రా షేర్ చేశారు. వారిద్దరి మధ్య ఉన్న భౌతిక దూరం మాట ఎలా ఉన్నా.. కనీసం ముఖాలకు మాస్కులు కూడా లేవు. కరోనా వేళ.. ఈ చిత్రం ఆయనను కాస్త అసహనానికి గురిచేసింది. ‘మనకు భౌతిక దూరం అలవాటు కాలేదని ఈ చిత్రాన్ని చూస్తే స్పష్టమవుతోంది. కానీ, మనవంతుగా నిబంధనలు పాటించాల్సిన సమయమిది. తలలు వెనక్కి జరిపి.. మాస్కులు ధరించండి’ అంటూ ట్విటర్ వేదికగా చురకలు వేశారు. బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్‌ మజుందార్ కూడా ఈ చిత్రాన్ని షేర్ చేసి, ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న ఈ చిత్రం ఎప్పటిదో మాత్రం స్పష్టత లేదు.

( చదవండి: COVID-19 Vaccines: వ్యాక్సిన్ల సామర్థ్యం ఎంత? )

మరిన్ని వార్తలు