‘దేశంలో ‘ట్రన్నల్స్‌’ నిర్మించండి’.. గడ్కరీకి ఆనంద్‌ మహీంద్ర వినతి

28 Aug, 2022 12:26 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆసక్తికర వీడియోలను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్‌ ఆనంద్‌ మహీంద్ర. తాజాగా మరో అందమైన, అద్భుత ట్రీ టన్నల్‌ (ట్రన్నల్‌) దృశ్యాలతో కూడిన వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా.. దేశవ్యాప్తంగా నిర్మిస్తున్న గ్రామీణ రహదారుల వెంట ఇలాంటి చెట్లను నాటి ‘ట్రన్నల్స్‌’ నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కోరారు. 

‘నాకు సొరంగాలు(టన్నల్స్‌) అంటే చాలా ఇష్టం. కానీ, నిజంగా ఇలాంటి ‘ట్రన్నల్స్‌’ గుండా వెళ్లడానికి ఇష్టపడతాను. కొత్తగా నిర్మించే గ్రామీణ రహదారుల వెంట చెట్లు నాటి ఇలాంటి ట్రన్నల్స్‌ను మనం నిర్మించగలమా నితిన్‌ గడ్కరీ జీ?’ అంటూ రాసుకొచ్చారు ఆనంద్‌ మహీంద్ర. ఈ వీడియో షేర్‌ చేసినప్పటి నుంచి రెండు మిలియన్లకుపైగా వ్యూస్‌ వచ్చాయి. 37వేలకుపైగా లైకులు వచ్చాయి. ‘ప్రపంచంలోనే సహసిద్ధ టన్నల్‌’ అంటూ ఓ యూజర్‌ రాసుకొచ్చారు. ‘రోడ్డుపై ఉష్ణోగ్రతలను ఈ టన్నల్స్‌ తగ్గిస్తాయి’ అని మరొకరు పేర్కొన్నారు. 

మరోవైపు.. ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌కు స్పందించారు కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి దినేశ్‌ త్రివేది. ‘వృక్షాలు బలంగా లేకపోతే వాహనాలపై పడతాయి. హైవేలపై పడి ప్రయాణాలకు ఆటంకం కలిగిస్తాయి. ఇది ఆ ప్రాంతంలోని మట్టి, వాతావరణ పరిస్థితులు, చెట్ల రకాలపై ఆధారపడి ఉంటుంది. భద్రత అనేది సమస్య కానప్పుడు ఇది చాలా అందంగా కనిపిస్తుందని చెప్పగలను.’ అంటూ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Anand Mahindra: ఆనంద్‌ మహీంద్ర అద్భుతమైన పోస్ట్‌: నెటిజన్లు ఫిదా

మరిన్ని వార్తలు