విహారయాత్రలో విషాదం: అనంతపురానికి చెందిన ఫ్యామిలీ మృతి

11 Dec, 2022 04:48 IST|Sakshi

యశవంతపుర: కారును ప్రైవేట్‌ బస్‌ ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన శనివారం ఉదయం జరిగింది. ఉడుపి జిల్లా కార్కళ తాలూకా నెల్లికారు గ్రామ పంచాయతీ పరిధిలోని మైనేరు వద్ద ప్రమాదం జరిగింది. ప్రైవేట్‌ బస్‌ వేగంగా వచ్చి కారును ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన శ్రీకాంత్‌ (36), భార్య ప్రత్యూష, మూడేళ్ల కూతురు గమ్య దుర్మరణం పాలయ్యారు. బస్సు ధాటికి కారు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.  

శృంగేరికి వెళ్తుండగా..  
దంపతులు ఇద్దరూ బెంగళూరులో టెక్కీలుగా పనిచేస్తారు. వారాంతపు సెలవులు కావడంతో సొంత కారులో పుణ్యక్షేత్రాల దర్శనానికి బయల్దేరారు. శుక్రవారం రాత్రి ధర్మస్థలకు చేరుకున్నారు. మంజునాథస్వామిని దర్శించికొని అక్కడి నుంచి శృంగేరికి వెళ్తుండగా ఘాటు రోడ్‌ మలుపు వద్ద వద్ద కారు– బస్సు వేగంగా ఢీకొన్నాయి. కారు  నుజ్జునుజ్జు కాగా ముగ్గురూ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కన్నుమూశారు. మృతులు అనంతపురం జిల్లావాసులని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోలీసులు మూడబిదిరె ఆస్పత్రిలో ఉంచారు.

మృతులు అనంతపురం జిల్లావాసులు 
ఉరవకొండ: అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం సమీపంలోని చిన్న ముష్టూరు గ్రామానికి చెందిన దంపతులు కర్ణాటకలో ఉడుపి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో విషాదం అలముకొంది. వివరాల్లోకి వెళితే చిన్న  ముషూ్టరు గ్రామానికి చెందిన విశ్రాంత ఉద్యోగి మాసినేని శ్రీరాములు, అనంతలక్ష్మి దంపతుల కుమారుడు శ్రీకాంత్‌ (36) అతని భార్య  ప్రత్యూషా (30)లు బెంగళూరులో సాప్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరికి మూడేళ్ల కుమార్తె గమ్య, ఏడాది బాబు ఉన్నారు. బెంగళూరు నుంచి దైవదర్శనానికి కారులో వెళ్లారు. ధర్మస్థలం దాటగానే ఓ ప్రైవేట్‌ బస్సు వేగంగా వచ్చి వీరి కారును ఢీకొనడంతో కారు నుజ్జు నుజ్జు అయి శ్రీకాంత్, ప్రత్యూషా పాటు కుమార్తె గమ్య దుర్మరణం పాలయ్యారు. ఒకేసారి రోడ్డు ప్రమాదంతో ముగ్గురు మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

 

మరిన్ని వార్తలు