Anbu Jothi Ashram: సాయం పేరిట ఘోరం.. ఆశ్రమం ముసుగులో లైంగిక దాడులు, అవయవాల దోపిడీ? 

17 Feb, 2023 09:02 IST|Sakshi
ఆశ్రమంలో పిల్లలను కట్టిపడేసిన దృశ్యాలు, ఇన్‌సెట్లో నిర్వాహకుడు జుబిన్‌

పేరుకు అనాథ ఆశ్రమ నిర్వాహకులు.. కానీ వారి మనసంతా కాలకూట విషమే. అవును.. మానసిక వికలాంగులు, దిక్కులేని వారిని ఆదరిస్తామంటూ తమ ఆశ్రమంలో చేర్చుకుని.. వారిపై లైంగిక దాడులు చేయిస్తూ సొమ్ము దండుకుంటున్నారు. అంతేకాక కొందరి అవయవాలను సైతం ప్రైవేటు ఆస్పత్రులకు అడ్డోగోలుగా అమ్మేస్తూ.. నరరూప రాక్షసులను తలపిస్తున్నారు. విల్లుపురం జిల్లాలో వెలుగు చూసిన ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

సాక్షి, చెన్నై: అభాగ్యులను చేరదీస్తామనే ముసుగులో దారుణాలకు పాల్పడుతున్న అన్బు జ్యోతి అనాథ ఆశ్రమ బండారం గురువారం అధికారుల విచారణలో బయటపడింది. ఇప్పటి వరకు ఈ ఆశ్రమం నుంచి 14 మంది అదృశ్యమైనట్లు వెలుగు చూసింది. ఇక తమ దారుణాలు బయటి ప్రపంచానికి తెలియడంతో అనారోగ్యం పేరిట నాటకాలాడిన నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు.


అన్బుజ్యోతి ఆశ్రమం (ఇన్‌సెట్‌) పోలీసులు రక్షించిన అభాగ్యులు 

వివరాలు.. విల్లుపురం జిల్లా విక్రవాండి సమీపంలోని గుండల పులియూర్‌లో అన్బుజ్యోతి పేరుతో ఓ అనాథ ఆశ్రమం ఉంది. దీనిని కేరళకు చెందిన జుబీన్‌(45), ఆయన భార్య మరియ జుబీన్‌ నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమంలో ఉన్న వారు తరచూ కనిపించకుండా పోతున్నట్లుగా చాలా కాలంగా ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం తిరుప్పూర్‌కు చెందినన హనీదుద్దీన్‌ తన బంధువు జబరుల్లా(45)ను ఈ ఆశ్రమంలో చేర్పించారు.

మానసిక రుగ్మతతో బాధ పడుతున్న వారికి ఇక్కడ ప్రత్యేక చికిత్స ఇస్తుండడంతో అనేక మంది యువతులు, మహిళలను వారి కుటుంబాలు తీసుకొచ్చి ఇక్కడ వదిలి పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారం క్రితం జబరుల్లా బెంగళూరులో ప్రత్యక్షం కావడంతో హనీదుద్దీన్‌కు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే పోలీసులతో పాటు కోర్టును కూడా ఆశ్రయించారు.


ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడుతున్న అధికారులు 

కోర్టు ఆదేశాలతో పోలీసులు రహస్యంగా దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో ఆశ్రమంలో ఉంటున్న కోల్‌క తాకు చెందిన ఓ యువతి విచారణలో తనకు మత్తు మందు ఇచ్చి రాత్రిళ్లు లైంగిక దాడికి పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.


పోలీసుల అదుపులో ఆశ్రమ సిబ్బంది

ఆశ్రమం సీజ్‌..? 
ఆశ్రమంలో ఉన్న రికార్డుల ఆధారంగా బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. కొందరు వచ్చి తమ వారిని వెంట బెట్టుకెళ్లారు. మరి కొందరి బంధువులు రాకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సెంజి డీఎస్పీ ప్రియదర్శిని నేతృత్వంలోని బృందం దృష్టి సారించింది. కలెక్టర్‌ పళణి ఆదేశాల మేరకు ఆశ్రమాన్ని సీజ్‌ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక ఈ ఆశ్రమంలోని మానసిక రోగులు, అనాథలను పొలీసు సంరక్షణలో ఉంచారు. ఈ ఆశ్రమానికి అనుబంధం ఉన్న మరో భవనంలో 27 మంది మానసిక రోగులను నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లతో ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. వీరంతా తమకు వైద్య పరీక్షలు నిర్వహించారని చెప్పడంతో అవయవాల విక్రయం కోసమే ఇదంతా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆశ్రమం నుంచి 14 మంది అదృశ్యం అయినట్లు తేలింది. వీరి సమాచారంపై ఆందోళన నెలకొంది.


విచారణ జరుపుతున్న పోలీసులు

అలాగే ఇక్కడి అనాథలు, మానసిక రోగుల అవయవాలను ప్రైవేటు ఆసుపత్రులకు అమ్ముకుంటున్నారనే అంశానికి సంబంధించిన రికార్డులు బయటపడినట్లు కూడా ప్రచారం సాగుతోంది. బాధితుడు జబరుల్లాను ఆశ్రమ నిర్వాహకులు బెంగళూరుకు పంపించడంతో అక్కడి ఆసుపత్రులతో ఈ ఆశ్రమానికి ఉండే సంబంధాలపై ఆరా తీస్తున్నారు.

 

సోదాలు...రక్షింపు.. 
బుధవారం రాత్రి పోలీసులు, రెవెన్యూ, వైద్యాధికారులు ఆశ్రమంలో పెద్దఎత్తున సోదాలు చేశారు. ఇక్కడ మొత్తం 150 మంది మానసిక రోగులు, 27 మంది అనాథలు ఉన్నట్లు తేలింది. అయితే అనేక మంది మహిళలు తమకు రాత్రుల్లో మత్తు మందు ఇస్తున్నారని, తమపై కొందరు లైంగిక దాడి చేస్తున్నారని పోలీసుల ఎదుట వాపోయారు. దీంతో  ఆశ్రమ నిర్వాహకులను అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైంది.

ఈ సమాచారంతో జుబీన్, ఆయన భార్య మరియా అనారోగ్యం బారిన పడ్డామంటూ విల్లుపురం ముండియం బాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. దీంతో పోలీసులు ఆశ్రమ మేనేజర్‌ కేరళకు చెందిన విజయ మోహన్‌(46),  సిబ్బంది అయ్యప్పన్, గోపీనాథ్, ముత్తమారితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిపై 13 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిర్వాహకులు జుబీన్, ఆయన భార్య మరియా ఆరోగ్యంగానే ఉన్నట్టు వైద్యులు తేల్చడంతో గురువారం అరెస్టు చేశారు.  

మరిన్ని వార్తలు