ప్రాణాలను సైతం లెక్క చేయలేదు.. నదిని దాటి మరీ..

14 Sep, 2021 15:13 IST|Sakshi
నదిని దాటుతున్న ఆరోగ్య సిబ్బంది

జయపురం(భువనేశ్వర్‌): ప్రజలకు సేవలు అందించేందుకు అంగనబడి, హెల్త్‌ వర్కర్లు ప్రాణాలకు తెగించారంటే సాధారణంగా నమ్మశక్యం కాదు. కానీ, ఆదివారం జయపురం సబ్‌డివిజన్‌ ముండిగుడ గ్రామంలో అసాధారణ దృశ్యం ఆవిష్కృతమైంది. ముండిగుడ గ్రామస్తులకు ఆదివారం బలిగాంలో కోవిడ్‌ టీకాలు ఇస్తామని ఆరోగ్య సిబ్బంది ముందుగానే ప్రకటించారు.

అయితే, భారీ వర్షం కురవడంతో గ్రామస్తులు టీకా కేంద్రానికి రాలేకపోయారు. వర్షాలకు మార్గమధ్యంలో ఉన్న నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామస్తులు వెనక్కుతగ్గారు. విషయం తెలుసుకున్న హెల్త్‌వర్కర్‌ సుధామణి, అంగనబడి వర్కర్‌ సులోచన.. ఎలాగైనా ముండిగుడ గ్రామ ప్రజలకు కోవిడ్‌ టీకాలు ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. నడుం లోతు నీరు పారుతున్న నదిని దాటుకుంటూ గ్రామానికి చేరుకుని గ్రామస్తులకు టీకాలు ఇచ్చారు.

అంగన్‌బడి వర్కర్, హెల్త్‌ వర్కర్‌ సాహసానికి, కర్తవ్య దీక్షకు గ్రామస్తులు అబ్బురపడ్డారు. వారు నది దాటుతున్న దృశ్యాలను కొందరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అవి కాస్తా వైరల్‌ అయ్యాయి. కర్తవ్య నిర్వహణలో ప్రమాదం పొంచి ఉన్నా లెక్కచేయకుండా ప్రభుత్వ సిబ్బంది విధులు నిర్వహించడం పట్ల అభినందనలు వెల్లువెత్తాయి. 

చదవండి: ప్రియుడిని చొక్కా పట్టి ఈడ్చుకెళ్లిన ప్రియురాలు

మరిన్ని వార్తలు