హథ్రాస్‌ ఆగ్రహం.. 50 కుటుంబాలు మత మార్పిడి

21 Oct, 2020 12:49 IST|Sakshi

ల​క్నో: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ కేసులో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల బాధితురాలి సామాజిక వర్గం(వాల్మీకి) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దాంతో ఆ వర్గానికి చెందిన 50 కుటుంబాలకు చెందిన 236 మంది ప్రజలు బౌద్ధమతాన్ని స్వీకరించినట్లు సమాచారం. ఈ సంఘటన ఘజియాబాద్‌లోని కర్హేడా ప్రాంతంలో అక్టోబర్ 14న చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాల్మీకి వర్గానికి చెందిన 236 మంది ప్రజలందరు బౌద్ధమతాన్ని స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ ముని ముని మనవడు రాజరత్న సమక్షంలో వీరు బౌద్ధంలోకి మారారు. హథ్రాస్ సంఘటనతో తాము బాధపడ్డామని, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్నప్పటికీ, నాయకులు, అధికారులు వారి బాధలు వినలేదని కుటుంబాలు ఆరోపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఉంది. దీనిలో రాజరత్న అంబేద్కర్, వాల్మీకి వర్గ ప్రజలను బౌద్ధమతంలోకి ప్రవేశపెట్టడాన్ని చూడవచ్చు. వీరందరు భారత బౌద్ధ సర్వసభ్య ధృవీకరణ పత్రం కూడా పొందారు. (చదవండి: హథ్రస్‌ కేసు: ఆ రైతు పాలిట శాపంగా..)

బౌద్ధమతంలోకి వెళ్ళిన ప్రజలలో ఒకరైన బిర్ సింగ్ మాట్లాడుతూ, “మా గ్రామంలోని 50 కుటుంబాలకు చెందిన 236 మంది మహిళలు, పిల్లలతో సహా బౌద్ధమతంలోకి మారాము. దీనికి ఎటువంటి ఫీజు తీసుకోలేదు. బౌద్ధమతాన్ని స్వీకరించిన తరువాత, సామాజిక సేవ వంటి మంచి కార్యకలాపాలను చేపట్టాలని మాకు బోధించారు" అని తెలిపారు. ఇక సెప్టెంబర్ 14 న, హథ్రాస్‌లోని బుల్గాది గ్రామంలో వాల్మీకి వర్గానికి చెందిన బాలికపై సామూహిక అత్యాచారం, హత్యతో ఆగ్రహం చెలరేగింది. ఈ సంఘటన తరువాత, వాల్మీకి సమాజ్ నిరసన వ్యక్తం చేసి వివిధ ప్రదర్శనలు నిర్వహించింది. ప్రస్తుతం సీబీఐ ఈ కేసును విచారిస్తోంది. నలుగురు నిందితులను అలీగఢ్‌ జైలులో ఉంచారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా