కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. బీబీసీ డాక్యుమెంటరీపై మోదీకి మద్దతుగా ట్వీట్‌.. మరుసటి రోజే!

25 Jan, 2023 11:17 IST|Sakshi

కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్‌ ఆంటోనీ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ ఈ రాజీనామాకు కారణంగా మారింది. 

2002 గుజరాత్ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీపై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై అనిల్‌ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీని వ్యతిరేకిస్తూ అనిల్‌ ఆంటోనీ పోస్టు చేయగా.. తన ట్వీట్‌ను వెనక్కి తీసుకోవాలంటూ అతనికి కాంగ్రెస్‌ పార్టీ నుంచి తీవ్ర ఒత్తడి ఎదురైంది. ఈ క్రమంలోనే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించారు. మోదీపై డాక్యుమెంటరీపై విమర్శించిన మరుసటి రోజే అనిల్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

‘కాంగ్రెస్‌ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాను. నా ట్వీట్‌ను వెనక్కి తీసుకోవాలని విపరీతమైన ఒత్తిడి చేశారు. అది కూడా వాక్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వారి నుంచి వచ్చింది. కానీ దానికి నేను నిరాకరించాను. ప్రేమను ప్రచారం చేసే వారే ఫేస్‌బుక్‌లో నాపై ద్వేషాన్ని వెల్లగక్కుతున్నారు. దీనినే హిపోక్రసీ అంటారు. జీవితం సాగుతూనే ఉంటుంది’ అంటూ ట్విటర్‌లో రాజీనామా లేఖను కూడా పోస్టు చేశారు.

‘నిన్నటి నుంచి  సంఘటనలను పరిశీలిస్తే  కాంగ్రెస్‌లోని నా అన్ని పదవులను  వదిలేయడానికి సరైన సమయమని నమ్ముతున్నాను. కేపీసీసీ డిజిటల్‌ మీడియా కన్వీనర్‌, ఏఐసీసీ సోషల్‌ మీడియా- డిజిటల్‌ కమ్యూనికేషన్‌ సెల్‌ జాతీయ కో ఆర్డినేటర్‌ పదవులకు రాజీనామా చేస్తున్నాను. నా రాజీనామా లేఖను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను. నేను ఇక్కడ ఉన్న  కొద్ది కాలంలో నాకు సహరించిన కేరళ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వానికి, నేతలకు, పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా ఎంపీ శంశిథరూర్‌కు ధన్యవాదాలు.’ అని తెలిపారు.

ఇక  ఇప్పటికే మోదీపై  ‘ఇండియా ద మోదీ క్వశ్చన్‌’ పేరుతో బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ లింక్‌లను బ్లాక్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం  యూట్యూబ్‌, ట్విట్టర్‌ సంస్థలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో  ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీ నుంచి మోదీకి అనూహ్య మద్దతు లభించింది.  భారతీయ సంస్థలపై బ్రాడ్‌కాస్టర్‌ అభిప్రాయాలను వెల్లడించడం దేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కడం కిందకే వస్తుందంటూ ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు. 2002 గుజరాత్ అల్లర్లపై రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీని కేరళలో ప్రదర్శిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ లోని వివిధ విభాగాలు ప్రకటించిన తరుణంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు.
చదవండి: కొలీజియం తీర్మానం తీవ్ర ఆందోళనకరం

మరిన్ని వార్తలు