రిసెప్షనిస్ట్‌ అంకిత పోస్ట్‌మార్టం నివేదిక.. అత్యాచారం జరిగిన ఆధారాలు లేవు!

28 Sep, 2022 18:49 IST|Sakshi

దేహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లో రిసెప్షనిస్ట్‌, 19ఏళ్ల యువతి హత్య కేసు రాజకీయంగా దుమారానికి దారితీసింది. ఈ కేసులో బహిష్కృత భాజపా నేత కుమారుడు, రిసార్ట్‌ యజమాని పుల్‍కిత్‌ ఆర్య, ఇద్దరు సిబ్బందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ హత్య కేసులో మరో కీలక విషయం బయటకు వచ్చింది. హత్యకు ముందు యువతిపై అత్యాచారం జరిగినట్లు ఆధారాలు లేవని పోస్ట్‌మార్టం నివేదికలో తేలినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఆమె వేళ్లు, చేతులు, వీపు భాగాల్లో గాయాలైనట్లు గుర్తులు కనిపించినట్లు పేర్కొన్నాయి.

ఈ కేసులో బాధిత కుటుంబానికి న్యాయం జరిగే దిశగా చర్యలు చేపట్టారు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. కేసును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో విచారించనున్నట్లు చెప్పారు. అలాగే మృతురాలి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. అంకిత తండ్రితో సీఎం మంగళవారం ఫోన్లో మాట్లాడారు. ఈ కేసు విచారణను వేగంగా జరిపించి నిందితులకు కఠినశిక్ష పడేలా చేస్తామని హామీ  ఇచ్చారు. ఆ మరునాడే పరిహారం ప్రకటించారు.

ఇదీ కేసు..
భాజపా బహిష్కృత నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్‌కిత్‌ ఆర్యకు రిషికేశ్‌లో రిసార్టు ఉంది. అందులో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోన్న 19 ఏళ్ల యువతి ఇటీవలే హత్యకు గురైంది. కొద్దిరోజుల తర్వాత అక్కడికి దగ్గర్లోని కాలువలో ఆమె మృతదేహం లభించింది. రిసార్టుకు వచ్చే అతిథులకు ఆమె ‘ప్రత్యేక’ సేవలు చేసేందుకు నిరాకరించినందుకే పుల్‍కిత్‌, మరో ఇద్దరు సిబ్బంది ఆమెను హత్యచేసినట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు పోలీసులు. తనను వ్యభిచార కూపంలోకి లాగేందుకు యత్నిస్తున్నారని వాట్సాప్‌లో  స్నేహితుడితో ఆమె మొరపెట్టుకున్న స్క్రీన్ షాట్లు, ఓ ఫోన్‌ కాల్ వివరాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

ఇదీ చదవండి: Uttarakhand: రిసెప్షనిస్ట్‌ అంకిత కుటుంబానికి రూ.25లక్షల ఆర్థిక సాయం

మరిన్ని వార్తలు