రిసెప్షనిస్ట్ అంకిత అంత్యక్రియలు పూర్తి.. సీఎం హామీతో భౌతికకాయాన్ని తీసుకెళ్లిన కుటుంబసభ్యులు

25 Sep, 2022 19:51 IST|Sakshi

దెహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య రిసెప్షనిస్ట్ అంకిత భండారీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మొదట పోస్టుమార్టం నివేదిక వచ్చాకే ఆమె భౌతిక కాయాన్ని మార్చురీ నుంచి తీసుకెళ్తామని చెప్పిన కుటుంబసభ్యులు .. ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. 

అంకిత హత్య కేసు విచారణ వీలైనంత త్వరగా పూర్తి చేయడమే గాక, తుది పోస్టుమార్టం నివేదికను బహిరంగంగా వెల్లడిస్తామని సీఎం పుష్కర్ సింగ్ ధామీ హామీ ఇచ్చారు. దీంతో అంకిత భౌతిక కాయాన్ని తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు తల్లిదండ్రులు. అయితే ఈ కార్యక్రమానికి స్థానికులను ఎవరినీ అనుమతించలేదు.

మరోవైపు అంకిత తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లినప్పుడు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. అంకితకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అంకిత కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేస్తామని సీఎం ధామీ చెప్పారు. 

బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు అంకిత్ ఆర్యకు చెందిన రిసార్టులో రిసెప్షనిస్ట్‌గా పనిచేసే అంకిత భండారీ హత్యకు గురైన విషయం తెలిసిందే. గత ఆదివారం అదృశ్యమైన ఆమె శనివారం కాలువలో శవంగా లభించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అంకిత్ ఆర్యను విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అంకిత్‌తో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరు రిసార్టు సిబ్బందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
చదవండి: రిసెప్షనిస్ట్ హత్య కేసులో షాకింగ్‌ నిజాలు..

మరిన్ని వార్తలు