మరో 10 కోట్ల డోసుల వ్యాక్సిన్స్‌: సీరమ్‌

30 Sep, 2020 08:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌తోపాటు తక్కువ, మధ్య ఆదాయ దేశాల కోసం అదనంగా 10 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయనున్నట్టు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా మంగళవారం వెల్లడించింది. 10 కోట్ల డోసుల కోవిడ్‌-19 వ్యాక్సిన్ల సరఫరాకై సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆగస్టులో గవి, బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌తో  ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా ఒప్పందం ప్రకారం మొత్తం 20 కోట్ల డోసుల వరకు ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు కావాల్సిన నిధులు సీరమ్‌కు సమకూరతాయి.

నియంత్రణ సంస్థ, డబ్లు్యహెచ్‌వో నుంచి అనుమతి రాగానే వ్యాక్సిన్ల సరఫరా ప్రారంభిస్తామని సీరమ్‌ సీఈవో అదర్‌ పూనావాలా తెలిపారు. గవి కోవ్యాక్స్‌ ఏఎంసీ విధానం ప్రకారం డోసులను 2021 తొలి అర్థభాగం ప్రారంభంలో పంపిణీ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ గతంలో ప్రకటించిన రూ.1,125 కోట్లకుతోడు మరో రూ.1,125 కోట్లను గవి సంస్థకు అందిస్తుంది. వ్యాక్సిన్ల తయారీకి ఈ మొత్తాన్ని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వినియోగిస్తుంది.

చదవండి :  ఏడాది చివరికి కొవాక్జిన్‌
చిన్నసైజు తుంపర్లతోనూ కరోనా

మరిన్ని వార్తలు