Maratha Reservation: ఏక్‌ మరాఠా.. లాఖ్‌ మరాఠా

28 Jun, 2021 17:59 IST|Sakshi
ముంబైలో ర్యాలీగా వెళ్తున్న మరాఠా క్రాంతి మోర్చా కార్యకర్తలు

 రిజర్వేషన్‌ కోసం ముంబైలో మరాఠాల బైకు ర్యాలీ

మోర్చాకు వందలాదిగా తరలివచ్చిన యువతీయువకులు

రిజర్వేషన్‌పై తొందరగా నిర్ణయం తీసుకోకపోతే లక్ష మందితో ర్యాలీ చేస్తామని హెచ్చరిక 

సాక్షి ముంబై: రిజర్వేషన్‌ కోసం మరాఠా క్రాంతి మోర్చా ఆధ్వర్యంలో ముంబైలో బైక్‌ ర్యాలీ జరిగింది. వందాలది బైక్‌లతో నిర్వహించిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో మరాఠా సమాజం ప్రజలు పాల్గొన్నారు. యువకులతోపాటు మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు. శాంతియుతంగా నిర్వహించిన ఈ ర్యాలీలో ప్రారంభం నుంచి చివరి వరకు ‘ఏక్‌ మరాఠా..  లాఖ్‌ మరాఠా..’, ‘జై శివాజీ... జై భవానీ’, ‘హరహర మహదేవ్‌’ తదితర నినాదాలతో సాగింది. దీంతో పరిసరాలన్ని మారుమ్రోగాయి.

ముంబై సైన్‌లోని సోమయ్య మైదానం నుంచి ఆదివారం ఉదయం సుమారు 11.30 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ ర్యాలీ సైన్, మాటుంగా, దాదర్, పరెల్,  భైకల్లాల మీదుగా ఛత్రపతి శివాజీ మహారాజు టెర్మినస్‌ (సీఎస్‌ఎంటీ) వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో పాల్గొన్న యువతి, యువకులు ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. వివిధ రకాల బైక్‌లపై వందలాది మంది నినాదాలు చేస్తు మందుకు సాగారు. కాషాయ జెండాలు చేతపట్టుకొని తలపై తెల్ల టోపీలు ధరించారు. ఇలా ప్రత్యేక వేషాధారణతో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. మరాఠా సమాజం నిర్వహించిన ఈ  ర్యాలీలో బీజేపీ నాయకులు ఆశీష్‌ శెలార్, ప్రవీణ్‌ దరేకర్‌లతోపాటు పలువురు నేతలు పాల్గొని తమ మద్దతు ప్రకటించారు.


ముంబైలోని ఓ ఫ్లైఓవర్‌పై ర్యాలీగా వెళుతున్న మరాఠాలు 

 సహనాన్ని పరీక్షించొద్దు.. 
మరాఠా సమాజానికి రిజర్వేషన్‌ తొందరగా ఇవ్వాలని లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని మరాఠా క్రాంతి సంఘర్స్‌ మోర్చా కన్వీనర్‌ రాజన్‌ శివసంగ్రామ్‌ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ వినాయక్‌ రావ్‌ మెటే  హెచ్చరించారు. సీఎస్‌ఎంటి వద్ద ఉన్న ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయం ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అదేవిధంగా తమ సహనాన్ని పరీక్షించ వద్దని హెచ్చరించారు. తొందర్లో ఈ అంశంపై నిర్ణయం వెలువడకపోతే ముంబైలో లక్ష మందితో కలిసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. మరాఠా క్రాంతి మోర్చా బైక్‌ ర్యాలీ కారణంగా సైన్‌– భైకళా–సీఎస్‌ఎంటీ ప్రధాన మార్గంపై ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది.  అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలతో ముఖ్యంగా అంబేడ్కర్‌ నగర్‌పై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. 


మరాఠాలకు రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం జరిగిన ర్యాలీలో సీఎస్‌ఎంటీ వద్ద 
శివాజీ ముఖచిత్రం కలిగిన జెండా ఊపుతూ వెళుతున్న ఓ మరాఠా యువకుడు 

ఈ ర్యాలీని పురస్కరించుకుని పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును మోహరించారు. మరోవైపు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఈ ర్యాలీలో వందలాది మంది పాల్గొన్నారు. 2018లో బీజేపీ, శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం మరాఠాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ అమలు చేస్తూ చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ, మరాఠాలు వెనకబాటుతనంలో లేరని పలువురు సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేయడంతో విచారించిన కోర్టు మరాఠాలకు రిజర్వేషన్‌ రద్దు చేసింది. మే 5న రిజర్వేషన్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో రగడ మొదలైంది. కాగా, ఇప్పటివరకు జరిగిన ఎలాంటి నియామకాలకైనా ఈ ఉత్తర్వులు అడ్డుకోలేవని తెలిపింది. దీంతో కోటాను రద్దు చేయడానికి ముందే ఎంపీఎస్‌సీ పరీక్షలకు హాజరైన 2,200 మంది మరాఠా అభ్యర్థులను ఆర్థికంగా బలహీనమైన విభాగంలో లేదా ఓపెన్‌ కేటగిరీలో చేర్చాలని ప్రభుత్వం రాష్ట్ర ప్రజా సేవా కమిషన్‌ను కోరింది. కాగా, గతంలోనే ప్రస్తుతం అమలులో ఉన్న 50 శాతం రిజర్వేషన్‌ పరిమితి (లిమిట్‌)ను ఎత్తివేయాలని ప్రధానితో డిమాండ్‌ చేసినట్లు ఉద్ధవ్‌ పేర్కొన్నారు.  

ఇక్కడ చదవండి: మావోయిస్టులకు చెందిన రూ.5కోట్లు స్వాధీనం

Devendra Fadnavis: మీ భార్యలు కొట్టినా మోదీ బాధ్యతేనా?

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు