క్యాబ్‌ డ్రైవర్‌ను కొట్టిన యువతి: గేటుకు నల్ల రంగు ఉందని రచ్చరచ్చ

6 Aug, 2021 12:34 IST|Sakshi

లక్నో: ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన ఓ యువతి క్యాబ్ డ్రైవర్‌ను కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. క్యాబ్‌ డ్రైవర్‌ తనను ఢీకొన్నాడని.. అతడిని తీవ్రంగా కొట్టింది. ఆమె ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు క్యాబ్‌ డ్రైవర్‌ని అరెస్ట్‌ చేశారు. అయితే ఆ తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన రెండో ఫుటేజ్‌ పరిశీలించగా ఆ యువతి చెప్పినదానికి.. అక్కడ జరిగిన దానికి ఏమాత్రం పొంతన లేదని తేలింది. దీంతో ఆ యువతిపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆ యువతికి సంబంధించిన మరో షాకింగ్‌ వీడియో బయటకు వచ్చింది. (చదవండి: ‘పోయిన పరువు తిరిగి తీసుకురాగలరా’... క్యాబ్‌ డ్రైవర్‌)

లక్నోలో ప్రియదర్శిని నారాయణ యాదవ్‌కు సంబంధించిన వీడియో ఆమె ప్రవర్తనా తీరును స్పష్టంగా చెబుతోంది. ఆమె నివసిస్తున్న ప్రాంతంలో ఒకరు తమ ఇంటి గేటుకు నలుపు రంగు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నలుపు రంగు ఎందుకు వేశారంటూ ఆ ఇంటివారితో గొడవకు దిగింది. వెంటనే రంగు మార్చాలని గట్టిగా అరుస్తూ ఉంది. మీ వలన కాలనీ అంతా ప్రమాదంలో పడుతుందని పేర్కొంది. డ్రోన్స్‌ ద్వారా దాడి జరుగుతుంది అని ఆందోళన వ్యక్తం చేసింది. గట్టిగా అరుస్తూ.. కేకలు వేస్తుండడంతో కాలనీలో కొంత గందరగోళం ఏర్పడింది. రాత్రిపూట వచ్చి ప్రియదర్శిని గొడవ చేయడంతో ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆమెతో మాట్లాడారు. పోలీసులతోనూ ఆమె గేటుకు ఉన్న నలుపు రంగు గురించే మాట్లాడింది. ఆమెకు నచ్చచెప్పేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడ్డారు. అనంతరం ఆమెను అక్కడి నుంచి పంపించారు.

దీనికి సంబంధించిన వీడియోను కొందరు రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. రెండేళ్ల కిందటి వీడియో అయినా ఇప్పుడు వైరలవుతోంది. క్యాబ్‌ డ్రైవర్‌పై దాడి నేపథ్యంలో ఇప్పుడు ఈ వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ప్రియదర్శిని మానసిక పరిస్థితి బాగా లేదేమో అని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మొదటి నుంచి ఇలాగే ఉందని చెబుతున్నారు. గేటుకు నల్లరంగు ఉంటే ఏమిటి? నీ ఒంటిపై కూడా నలుపు రంగు దుస్తులు ఉన్నాయి కదా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు