హింసను ఖండించిన రైతు సంఘాలు

26 Jan, 2021 18:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నూతన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రిప‌బ్లిక్ డే నాడు రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ పరేడ్‌లో హింస చెలరేగిన నేపథ్యంలో.. రైతు సంఘాల నేతలు స్పందించారు. తాము శాంతియుతంగా చేపట్టిన ర్యాలీలో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని వారు ఆరోపించారు. హింసకు పాల్పడిన వ్యక్తులు రైతులు కాదని వారు వెల్లడించారు. రైతుకు వ్యవసాయం చేయడం మాత్రమే తెలుసని, హింసకు రైతులు ఎప్పుడూ వ్యతిరేమేనని బీకేయూ నేత రాకేశ్‌ తికాయత్‌ స్పష్టం చేశారు. 

కాగా, మంగ‌ళవారం ఉదయం రైతులు త‌మ‌కు కేటాయించిన రూట్లలో కాకుండా ఇతరత్రా మార్గాల్లో ట్రాక్ట‌ర్ ర్యాలీని నిర్వ‌హించి సెంట్ర‌ల్ ఢిల్లీలోకి దూసుకొచ్చారు. ఈ ఆందోళనలో ట్రాక్ట‌ర్ అదుపు త‌ప్పడంతో ఓ రైతు మృతి చెందాడు. ఆ త‌ర్వాత వారు ఏకంగా ఎర్రకోట‌పైకి దూసుకెళ్లి, త్రివ‌ర్ణ ప‌తాకం స్థానంలో త‌మ జెండాను ఎగుర వేశారు. రైతుల‌ను అదుపు చేయ‌డానికి పోలీసులు శత విధాల ప్రయత్నించినా ఫ‌లితం లేక‌పోయింది. కొందరు రైతులు చూపిన అత్యుత్సాహానికి ఢిల్లీ అట్టుడికిపోయింది.

ప్రధాన రోడ్డు మార్గాలు మూసివేత..

ఢిల్లీలో అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రధాన రహదారులను మూసివేశారు. పార్లమెంట్‌, విజయ్‌చౌక్, రాజ్‌పథ్‌, ఇండియాగేట్ వైపు వెళ్లే దారులను డైవర్ట్‌ చేయడంతో ఇతర మార్గాల్లో భారీ రద్దీ నెలకొంది. 

మరిన్ని వార్తలు