బీజేపీకి సంకటం.. దేశ ప్రతిష్టకు భంగపాటు.. ఫలితం ఎలా ఉండనుంది..?

7 Jun, 2022 12:45 IST|Sakshi

జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మపై, పార్టీ ఢిల్లీ శాఖ మీడియా హెడ్‌ నవీన్‌ జిందాల్‌పై కాషాయ పార్టీ పెద్దలు సస్పెన్షన్‌ వేటు వేశారు. ఖతార్, కువైట్, ఇరాన్‌ సహా పలు అరబ్‌ దేశాల నుంచి సదరు అభ్యంతర వ్యాఖ్యలకు నిరసన ఎదురవడంతో, అధికార బీజేపీ.. వారిపై వేటు వేసింది. మరోపక్క ఆమె వ్యాఖ్యలు.. పశ్చిమాసియా దేశాల్లో లక్షలాది భారతీయుల ఉద్యోగాలకూ, సూపర్‌ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకూ ఉద్వాసన లాంటి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అరబ్ దేశాలు ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. 

ఇలాంటి తరుణంలో ఐక్యరాజ్యసమితి  కూడా ఈ విషయంపై తాజాగా స్పందించింది. భారత్‌ను సున్నితంగా హెచ్చరించింది. స‌హ‌నంగా ఉండాల‌ని సలహా ఇచ్చింది. తాజాగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ.. అన్ని మతాల పట్ల గౌరవం, సహనంతో వ్య‌వ‌హ‌రించాలని సూచించారు. 

మరోవైపు.. బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ను స్పందించాలని పాకిస్తాన్‌ జర్నలిస్టు కోరారు. ఈ సందర్భంగా యూఎన్‌ సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ మాట్లాడుతూ.. "ఈ ఘటనకు సంబంధించిన వార్తా కథలను చూశాను. ఈ వ్యాఖ్యలను నేను స్వయంగా చూడలేదు, కానీ.. అన్ని మతాల పట్ల గౌరవం, సహనాన్ని మేము బలంగా ప్రోత్సహిస్తున్నామని నేను మీకు చెప్పగలను అంటూ వ్యాఖ‍్యలు చేశారు. ఇదిలా ఉండగా ఆమె వ్యాఖ‍్యలు.. గల్ఫ్‌లోని భాగస్వామ్య దేశాలతో పెరుగుతున్న భారత సంబంధాలకు ఇబ్బంది తెచ్చాయి. భారత ఉపరాష్ట్రపతి మూడు రోజుల ఖతార్‌ పర్యటన వేళ మరింత ఇరుకునపెట్టాయి.

ఇది కూడా చదవండి: ప్రవక్తపై వ్యాఖ్యలతో దుమారం.. భగ్గుమంటున్న ముస్లిం దేశాలు

మరిన్ని వార్తలు