సినిమాలపై మోదీ సలహా.. పరిస్థితి చెయ్యి దాటిపోయిందన్న ప్రముఖ దర్శకుడు

19 Jan, 2023 19:52 IST|Sakshi

ముంబై: సొసైటీలో సినిమాల ప్రభావం ఎలా ఉన్నా.. ప్రస్తుతం సినిమాల చుట్టూరానే రాజకీయాలు కచ్ఛితంగా నడుస్తున్నాయి. తాజాగా.. సోమవారం జరిగిన బీజేపీ కీలక సమావేశంలో ప్రధాని మోదీ కార్యకర్తలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల మీద కామెంట్లు చేయడం, అతిగా స్పందించడం మానుకోవాలని ప్రధాని మోదీ.. కార్యకర్తలకు సూచించారాయన. అయితే..

ప్రధాని సలహాపై తాజాగా ప్రముఖ దర్శకుడు, బాలీవుడ్‌ ఫిల్మ్‌మేకర్‌ అనురాగ్‌ కశ్యప్‌ స్పందించారు.  పరిస్థితి ఎప్పుడో చెయ్యి దాటిపోయిందనన్నారు ఆయన. ముంబైలో తన తాజా చిత్రం ఆల్‌మోస్ట్‌ ప్యార్‌ విత్‌ డీజే మొహబ్బత్‌ చిత్ర ట్రైలర్‌ లాంఛ్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మోదీ తన పార్టీ కార్యకర్తలకు చేసిన సూచనపై దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ స్పందించారు. ‘‘ప్రధాని మోదీ నాలుగేళ్ల కిందట ఈ సలహా ఇచ్చి ఉంటే బాగుండేది. పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారుతుందని అనుకోవడం లేదు. పరిస్థితి చెయ్యి దాటిపోవడంతో.. జనాలు వాళ్లంతట వాళ్లే కంట్రోల్‌లో ఉండాల్సిందే తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఎవరు ఎవరికీ వింటారని అనుకోవడం లేద’’ని కశ్యప్‌ అభిప్రాయపడ్డారు. 

మరోవైపు చిత్ర నిర్మాత షరీఖ్‌ పటేల్‌ మాత్రం ప్రధాని సూచనపై సానుకూలంగా స్పందించారు. ఇకనైనా మంచి జరుగుతుందని ఆశిస్తున్నానని, ఇండస్ట్రీలో ఏర్పడిన నెగటివిటీ కనుమరుగు అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారాయన. 

ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌లో ఉత్త పుణ్యానికే బాయ్‌కాట్‌ ట్రెండ్‌ తెర మీదకు వస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సునీల్‌ శెట్టి.. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు ఈ ట్రెండ్‌కు అడ్డుకట్ట పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో రెండు వారాల తర్వాత పార్టీ కీలక సమావేశంలో ప్రధాని మోదీ సలహా ఇవ్వడం విశేషం. కిందటి ఏడాది బాయ్‌కాట్‌ ట్రెండ్‌ను చాలానే ఎదుర్కొన్నాయి. లాల్‌ సింగ్‌ చద్దా, రక్షా బంధన్‌, దొబారా, లైగర్‌, బ్రహ్మస్త్ర: పార్ట్‌ వన్‌-శివ బాయ్‌కాట్‌ ట్రెండ్‌లో అల్లలాడిపోయాయి. ఈ ఏడాది ప్రారంభంలో షారూక్‌ ఖాన్‌ పథాన్‌ చిత్రం బాయ్‌కాట్‌ట్రెండ్‌ను ఎదుర్కొంటోంది.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు