విచారణ ముగిసే వరకు వేచి ఉండండి!: అనురాగ్‌ ఠాకూర్‌

31 May, 2023 20:11 IST|Sakshi

నెలల తరబడి రెజ్లర్లంతా రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఛీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేయడమే గాక తమ పతకాలను గంగా నదిలో విసిరేస్తామని హెచ్చరించారు కూడా. ఐనా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై నోరు మెదపలేదు. అలాంటిది తొలిసారిగా ఆ విషయమైన సాక్షాత్తు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మాట్లాడటం విశేషం.

రెజ్లర్లు రోజుకో డిమాండ్‌తో వస్తున్నారని ఆరోపణలు చేశారు. క్రీడను, క్రీడాకారులను బాధించే ఎటువంటి చర్య తీసుకోవద్దని పునరుద్ఘాటించారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ..రెజ్లర్ల నిరసన చేసిన ప్రాంతానికి రాజకీయ నాయకులంతా పెద్ద ఎత్తున తరలివచ్చారని మండిపడ్డారు. అయినా ఇది రాజకీయాలు చేయడానికి వేదిక కాదని రెజ్లర్లే చెప్పారు కానీ వారంతా వచ్చారు. ఐనా తాను దీని గురించి పెద్దగా వ్యాఖ్యానించనన్నారు. ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ముగిసే వరకు వేచి ఉండమని మాత్రమే అథ్లెట్లను కోరుతున్నా. ఢిల్లీ పోలీసులు సుప్రీం కోర్టుకు తెలియజేసేలా ఎఫ​్‌ఆర్‌ దాఖలు చేశారు దర్యాప్తు వరకు పూర్తి అయ్యింది.

దయచేసి క్రీడకు, ఆటగాళ్లకు హాని కలిగించే ఏ చర్య తీసుకోవద్దని విజ్ఞప్తిచేశారు. అలాగే ఈ సమస్యపై విచారకు కమిటీ వేయాలన్న రెజ్లర్ల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించింది. వారు నిరసన వ్యక్తం చేస్తున్న ఫెడరేషన్‌ చీఫ్‌ని కూడా తొలగించారు. అంతేగాదు క్రీడాకారుల శిక్షణ, క్రీడా మౌలిక వసతుల మెరుగుదలకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించింది. ఇప్పుడు కూడా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఆదేశాల మేరకు పనిచేస్తోంది అని అనురాగ్‌ ఠాకూర్‌ చెప్పుకొచ్చారు.

ఆదివారం కొత్త పార్లమెంట్‌ ప్రారంభోత్సవ టైంలో నిరసనకు యత్నించిన రెజ్లర్లపై పోలీసుల చర్యకు సంబంధించిన దృశ్యాలు యావత్తు దేశాన్ని దిగ్బ్రాంతికి గురి చేశాయి. ఆ తదనందర ఈ అంశంపై మొట్టమొదటిసారగా ప్రభుత్వం వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలా ఉండగా, బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే ఎలాంటి శిక్షను స్వీకరించడానికైనా సిద్ధమేనని అన్నారు. ఒక్క ఆరోపణ రుజువైనా ఉరి వేసుకుంటానని చెప్పారు. రెజ్లర్లను ఉద్దేశిస్తూ.. మీ వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకి సమర్పించండి అని సవాలు కూడా విసిరారు సదరు బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌.

(చదవండి: కొందరు నేతలు ఆ వ్యాధితో బాధపడుతున్నారు.. ప్రధాని మోదీ కూడా!: రాహుల్‌)
   

మరిన్ని వార్తలు