ప్రభుత్వ అధికారాలపై విచారిస్తాం 

12 Nov, 2022 09:23 IST|Sakshi

గత సర్కారు నిర్ణయాలపై దర్యాప్తు చేసే అంశాన్ని పరిశీలిస్తాం

ఏపీ హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సవాల్‌

సిట్‌ దర్యాప్తును నిలిపివేసిందన్న ప్రభుత్వ న్యాయవాది

తదుపరి విచారణ 16కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వం మారిన తర్వాత ఏర్పడిన నూతన ప్రభుత్వం గత సర్కారు నిర్ణయాలపై దర్యాప్తు చేసే అంశంపై లోతుగా విచారిస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. అమరావతి భూముల విషయంలో గత ప్రభుత్వ నిర్ణయాలపై దర్యాప్తు చేయడానికి సిట్‌ ఏర్పాటుచేసే అధికారం తర్వాత వచ్చిన ప్రభుత్వానికి గవర్నమెంట్‌కు లేదన్న ఏపీ హైకోర్టు ఆదేశాలు సవాల్‌చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వి వాదనలు వినిపించారు. \

అసలు ఇది సీబీఐకి రిఫర్‌ చేయాల్సిన అంశమని తెలిపారు. అమరావతి భూములపై పలు నోటిఫికేషన్లు ఇచ్చామని, సిట్‌ ఏర్పాటుచేశామని, పోలీసు నోటీసులు కూడా ఇచ్చామని, అయినా హైకోర్టు మూడు డాక్యుమెంట్లు విస్మరించి సిట్‌ దర్యాప్తు నిలిపివేసిందన్నారు. రాజకీయ కక్షలు ఉన్నప్పటికీ వాస్తవాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేయడం సమంజసమేనని జగన్నాథరావు కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన విషయాన్ని సింఘ్వి ఉటంకించారు.

రాష్ట్రంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ లోతుగా పరిశీలించి కొన్ని సిఫార్సులు చేసిందని ఆ మేరకే సిట్‌ ఏర్పాటైందన్నారు. కానీ, సిట్‌ దర్యాప్తునకు దురుద్దేశాలు ఆపాదిస్తూ హైకోర్టు దర్యాప్తు నిలిపివేసిందన్నారు. ఎగ్జిక్యూటివ్‌ పవర్స్‌ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి దర్యాప్తు ఆదేశాలిచ్చే అధికారం ఎందుకు ఉండదని ప్రశ్నించారు. ఒకవేళ రాష్ట్ర దర్యాప్తు సంస్థలపై హైకోర్టుకు అనుమానముంటే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించొచ్చుగా అని తెలిపారు. కేబినెట్‌ సబ్‌ కమిటీ సిఫార్సులనే హైకోర్టు తప్పు పట్టిందని, హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చి విచారణ కొనసాగించేలా ఆదేశాలివ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. ఈ సమయంలో గత ప్రభుత్వ నిర్ణయాలపై సక్సెసర్‌ గవర్నమెంట్‌ దర్యాప్తు అనేది లార్జర్‌ ఇంట్రెస్ట్‌ అని ధర్మాసనం వ్యాఖ్యానించి బుధవారం విచారణ చేపడతామని పేర్కొంది. జాబితాలో టాప్‌ ఆఫ్‌ ద బోర్డుగా ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది.  

అంతమంది వాదనలు వినడం మా ప్రాక్టీసు కాదు.. 
అనంతరం.. కొన్ని డాక్యుమెంట్లు సమర్పిస్తామని ప్రతివాది వర్ల రామయ్య తరఫు న్యాయవాది తెలిపారు. ఈ సమయంలో.. ఇది క్వశ్చన్‌ ఆఫ్‌ లాకు సంబంధించిన అంశమని, వాస్తవాలు కనిపెట్టే అథారిటీ కాదని, తామేమీ సీబీఐ కానీ, సిట్‌ కానీ కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ తర్వాత.. ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తాను హైకోర్టులో ఒరిజినల్‌ రిట్‌ పిటిషనర్‌నని చెప్పారు. దీంతో.. ఎవరో ఒక న్యాయవాది వాదనలే వింటామని ధర్మాసనం స్పష్టంచేసింది. పది మంది ప్రతివాదులు ఉంటే పది మంది న్యాయవాదుల వాదనలు వినడం తమ ప్రాక్టీస్‌ కాదని పేర్కొంది. ప్రతివాదుల తరఫున ఎవరు వాదిస్తారో నిర్ణయించుకోవాలని సూచించింది. నవంబరు 16న తిరిగి విచారిస్తామంటూ ధర్మాసనం తెలిపింది.  

మరిన్ని వార్తలు