‘రాజధాని’పై 3 రోజులు విచారించాలి 

3 Mar, 2023 08:37 IST|Sakshi

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం ప్రస్తావన

సీజేఐ నిర్ణయం తీసుకోవాలన్న జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ ధర్మాసనం

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై వరుసగా మూడ్రోజులు విచారించాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును అభ్యర్థించారు.  ఈ అంశాన్ని ఏపీ తరఫు న్యాయవాది గురువారం జస్టిస్‌ కేఎం జోసెఫ్, జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ అహ్సానుద్దీన్‌ అమానుల్లా ధర్మాసనం ముందు ప్రస్తావించారు. రాజధానిపై వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని కోరారు.

సుప్రీంకోర్టు మార్చి 28 మంగళవారంతోపాటు బుధ, గురువారాల్లో కూడా విచారించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో.. బుధ, గురువారాల్లో కూడా విచారణ చేపట్టాలంటే సీజేఐ నిర్ణయం తీసుకోవాలని.. ఈ అంశాన్ని సీజేఐ ముందు ప్రస్తావించాల్సి ఉంటుందని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ తెలిపారు. అయితే, దానికి అనుమతివ్వాలని న్యాయవాది కోరారు.

సీజేఐ అనుమతిస్తే తమకేమీ అభ్యంతరంలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసులో రాజ్యాంగపరమైన అంశాలున్నాయని వ్యాఖ్యానించారు. అలాగే, ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయా అని జస్టిస్‌ బీవీ నాగరత్న ప్రశ్నించగా అవునని న్యాయవాది బదులిచ్చారు. ఒక తేదీని నిర్ణయించి కనీసం రెండు రోజులపాటు విచారణ చేయాలని ప్రతివాదులు తరఫు న్యాయవాది కోరారు. అయితే, విచారణ జాబితాలో చివరి అంశంగా తాము చేపట్టగలమని ధర్మాసనం పేర్కొంటూ విచారణను మార్చి 28నే చేపడతామని జస్టిస్‌ జోసెఫ్‌ స్పష్టంచేశారు.  

మరిన్ని వార్తలు