రోజుకు పది లక్షల వ్యాక్సిన్లు పంపిణీకి సిద్ధం : అపోలో

15 Oct, 2020 21:16 IST|Sakshi

సాక్షి, చెన్నై: కరోనావైరస్ మహమ్మారి కట్టడికి ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతుగా అపోలో హాస్పిటల్స్ కీలక విషయాన్ని ప్రకటించింది. రోజుకు 10 లక్షల కోవిడ్-19 వ్యాక్సిన్లను ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని  హాస్పిటల్ చైన్ అపోలో హాస్పిటల్స్ గ్రూప్ గురువారం తెలిపింది. కోల్డ్ చైన్ సదుపాయాలతో కూడిన 19 ఔషధ సరఫరా కేంద్రాలున్న పాన్ ఇండియా వెబ్‌ను ప్రభావితం చేస్తామని, 70 ఆస్పత్రులు, 400కి పైగా క్లినిక్‌లు, 500 కార్పొరేట్ ఆరోగ్య కేంద్రాలు, 4వేల ఫార్మసీలను కరోనా వ్యాక్సిన్ల పంపిణీకి విరివిగా ఉపయోగించుకుంటామని తెలిపింది. గరిష్ట సంఖ్యలో అత్యంత సురక్షితంగా, వేగంగా ప్రజలు వ్యాక్సిన్‌ను  పొందేలా చూస్తామని అపోలో  ప్రకటించింది. (రెండో వాక్సిన్ : పుతిన్ కీలక ప్రకటన)

ఈ మేరకు తమ బృందం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని వర్చువల్ మీడియా సమావేశంలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్‌పర్సన్ శోభనా కామినేని ప్రకటించారు. ఇందుకు  టీకా కోల్డ్ చెయిన్ ను బలోపేతం చేశామన్నారు. అత్యధిక భద్రతా ప్రమాణాలతో, రోజుకు ఒక మిలియన్ మోతాదులను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు చెప్పారు. దీనికోసం 10వేల మంది నిపుణులకు శిక్షణ ఇచ్చామని, వీరంతా దేశంలోని తమ అన్ని ఆసుపత్రులలోని ఫార్మసీలు, క్లినిక్‌లలో అందుబాటులో ఉంచుతామన్నారు. భారతదేశంలో దాదాపు 30 శాతం మంది అపోలో ఆస్పత్రులకు 30 నిమిషాల దూరంలో ఉన్నారనీ, ప్రభుత్వ ఆదేశాల మేరకు  ప్రతి ఆసుపత్రిలో వ్యాక్సిన్ ఇచ్చే సామర్థ్యం గల నిపుణులు ఉంటారని ఆమె తెలిపారు.  (వ్యాక్సిన్ : వారు 2022 వరకు ఆగాల్సిందే!)

కాగా వచ్చే ఏడాది ఆరంభం నాటికి భారతదేశానికి ఒకటి కంటే ఎక్కువ కోవిడ్-19 వ్యాక్సిన్లు వచ్చే అవకాశం ఉందని, దేశవ్యాప్తంగా పంపిణీ వ్యూహాలను ప్రభుత్వం రూపొందిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతదేశంలోని ఏడు  ఔషధ తయారీదారులకు  సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్  కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీకి లైసెన్స్ మంజూరు చేసింది. ముఖ్యంగా పూణేకు చెందిన సీరం,  క్యాడిల్లా,  భారత్ బయోటెక్, రిలయన్స్ లైఫ్ సైన్సెస్, అరబిందో ఫార్మా, జెన్నోవా లాంటి సంస్థలకు ప్రీ క్లినికల్ ట్రయిల్స్, ఎనాలిసిస్ కు అనుమతినిచ్చింది.
 

మరిన్ని వార్తలు