స్పీకర్‌ ఎన్నిక: చేతులు కలిపిన స్టాలిన్‌, పళని

13 May, 2021 08:55 IST|Sakshi

శాసన సభాపతిగా అప్పావు ఏకగ్రీవ ఎన్నిక

అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ బాధ్యతల స్వీకరణ

సీఎం స్టాలిన్, ప్రతిపక్ష నేత పళని అభినందనలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు 16వ అసెంబ్లీ స్పీకర్‌గా అప్పావు బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ప్రధాన ప్రతిపక్షనేత ఎడపాడి పళనిస్వామి తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు. డీఎంకే ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌ పిచ్చాండి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పదవీ ప్రమాణం చేయించారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్‌ పదవికి ఎన్నిక నిర్వహించగా అప్పావు స్పీకర్‌కు, డిప్యూటీ స్పీకర్‌ పదవికి పిచ్చాండి (తాత్కాలిక స్పీకర్‌) నామినేషన్లు వేశారు.

మలిరోజు అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం  10 గంటలకు నిర్వహించారు. కార్యదర్శి శ్రీనివాసన్‌ ఆధ్వర్యంలో అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక చేపట్టారు. అప్పావు స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రొటెం స్పీకర్‌ పిచ్చాండి అధికారికంగా ప్రకటించారు. సీఎం స్టాలిన్, ప్రధాన ప్రతిపక్ష నేత ఎడపాడి పళనిస్వామి అప్పావుని చేయి పట్టుకుని స్పీకర్‌ కుర్చీలో కూర్చోబెట్టి అభినందించారు. ఆ తరువాత స్పీకర్‌ అప్పావు అందరికీ కృతజ్ఞతలు తెలిపి డిప్యూటీ స్పీకర్‌గా పిచ్చాండి ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రకటించారు. తమిళనాడు అసెంబ్లీకి అప్పావు 20వ స్పీకర్‌.

చదవండి: అన్నాడీఎంకేకు మరో షాక్‌: చేజారనున్న ‘పెద్దరికం’
చదవండి: రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ

మరిన్ని వార్తలు