ప్రధాని మోదీ పర్యటన : సీరం కీలక ప్రకటన

28 Nov, 2020 20:30 IST|Sakshi

జూలై 2021 నాటికి  30-40 కోట్ల మోతాదుల  వ్యాక్సిన్‌ ఉత్పత్తి

2 వారాలలో వ్యాక్సిన్ అత్యవసర ఉపయోగం కోసం దరఖాస్తు: సీరం

సాక్షి, పుణే: ఆక్సఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్న దిగ్గజ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ శనివారం కీలక ప్రకటన చేసింది. కోవిడ్-19 వ్యాప్తికి కళ్లెం వేసే వ్యాక్సీన్ల అభివృద్ధి ప్రక్రియలను వ్యక్తిగతంగా పరిశీలించేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ టాప్‌-3 వ్యాక్సిన్‌ హబ్‌లను సందర్శించారు. ఇందులో భాగంగా పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించారు. అనంతరం సీరం సీఈఓ అదార​ పూనవల్లా మాట్లాడుతూ తమ కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అత్యసవర వినియోగం కోసం మరో రెండు వారాల్లో దరఖాస్తు చేయనున్నామని చెప్పారు. అలాగే జూలై నాటికి 30 నుంచి 40 కోట్ల మోతాదుల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తయారు చేయాలని కేంద్ర రప్రభుత్వం సూచిందని చెప్పారు. ఎన్ని మోతాదుల వ్యాక్సిన్‌ కొనుగోలు చేస్తుందనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేనప్పటికీ జూలై 2021 నాటికి ఇది 300-400 మిలియన్ మోతాదులను కొనుగోలు చేయనుందనే సూచన లభించిందని పూనవల్లా వెల్లడించారు. తమ వ్యాక్సిన్‌ 70 సమర్థతతో అత్యంత ప్రభావవంతమైందిగా తేలిందన్నారు. భారతదేశంలో కోవిషీల్డ్‌గా పిలుస్తున్నఈ టీకా ప్రస్తుతం మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉంది. (కరోనా మూలాలు ఇండియాలో : చైనా శాస్త్రవేత్తలు)

ఈ సందర్భంగా సీరం సీఈవో ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. వ్యాక్సిన్లు, వ్యాక్సిన్ ఉత్పత్తిపై  ప్రధాని పరిజ్ఞానాన్ని చూసి తామే ఆశ్చర్యపోయామని పూనవల్లా వ్యాఖ్యానించారు. వివిధ రకాల వ్యాక్సిన్లు, ఎదుర్కొనే సవాళ్లు తప్ప, తాము ఆయనకి వివరించిందేమీ లేదని తెలిపారు. వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ అమలు ప్రణాళికపై ప్రధానితో చర్చించామన్నారు.మరోవైపు సీరం కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. సీరం బృందంతో మంచి చర్చలు జరిగాయనీ, ఇప్పటివరకు జరిగిన కృషి, భవిష్యత్‌ పురోగతిపై వివరాలను వారు షేర్‌ చేశారని మోదీ పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీ వ్యాక్సిన్‌ టూర్‌లో భాగంగా హైదరాబాద్‌లోని భారత్ బయోటిక్, అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటిక్ పార్క్, పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్‌ను సందర్శించారు. మొదట గుజరాత్‌లోని ఫార్మా మేజర్ జైడస్ కాడిలా ప్లాంట్‌కు, ఆతరువాత కోవాక్సిన్‌ను ఉత్పత్తిచేస్తున్న హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌  కేంద్రానికి, చివరగా పూణేకు వెళ్లిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు