ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఫ్రెండ్స్‌ను ఏప్రిల్‌ ఫూల్స్‌ చేయబోయి..

3 Apr, 2021 16:31 IST|Sakshi

తిరువనంతపురం: ఏప్రిల్‌ 1వ తేదీని ఏప్రిల్‌ ఫూల్ డే‌గా భావిస్తారు. ఆ రోజు తమ వారిని కొంత ఫూల్‌ను చేద్దామని ప్రయత్నిస్తారు. ఆ క్రమంలో వింత వింత చేష్టలు చేస్తారు. అవి కొందరికి కోపం తెప్పిస్తాయి. మరికొన్ని తీవ్ర పరిస్థితులకు దారి తీస్తాయి. తాజాగా ఓ విద్యార్థి తన స్నేహితులను ఏప్రిల్‌ ఫూల్‌ చేయబోయి ప్రాణాలు కోల్పోయాడు. ఫేస్‌బుక్‌లో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లైవ్‌ వీడియో తీసుకునేందుకు ప్రయత్నించి మరణించిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. 

కేరళ అలప్పుజ జిల్లాలోని తళవాడి పప్రాంతంలోని కిలిరోర్‌లో సిద్ధార్థ్‌ అజయ్‌ (17) తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి నివసిస్తున్నాడు. ఏప్రిల్‌ 1వ తేదీ సందర్భంగా గురువారం రాత్రి భోజనం అనంతరం తన గదిలోకి వెళ్లాడు. తన స్నేహితులను ఏప్రిల్‌ ఫూల్‌ చేద్దామని భావించి ఓ ప్రాంక్‌గా ఆత్మహత్య చేసుకున్నట్లు నటిద్దామని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌ లైవ్‌ ఆన్‌ చేశాడు. బెడ్‌ షీట్‌తో ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు నటిద్దామని ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో ఆ బెడ్‌ షీట్‌ అతడికి బిగుతుగా బిగించుకుపోయి అతడికి ఊపిరాడకుండాపోయింది.

అయితే కుమారుడిని పిలుద్దామని గదిలోకి వెళ్లిన తల్లి నిర్ఘాంతపోయింది. కుమారుడు ఫ్యాన్‌కు వేలాడుతుండడంతో కంగారుపడింది. వెంటనే కుటుంబసభ్యుల సహాయంతో అజయ్‌ని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అజయ్‌ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ యువకుడి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా ఇంకా ఫేస్‌బుక్‌ లైవ్‌ కొనసాగుతుండడం గమనార్హం.

మరిన్ని వార్తలు