ఏప్రిల్‌ నెల వచ్చిందంటే దేశవాసుల గుండెల్లో రైళ్లు

2 May, 2021 02:35 IST|Sakshi

గత నెల దేశంలో కరోనా విలయతాండవం

ఏప్రిల్‌ నెలలో 69.43 లక్షల కేసులు.. 49 వేలమంది మృతి

ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు భారత్‌లో నమోదు

సాక్షి, న్యూఢిల్లీ: రెండేళ్ళుగా ఏప్రిల్‌ నెల వచ్చిందంటే చాలు దేశవాసుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో కరోనా సంక్రమణ కారణంగా లాక్‌డౌన్‌ను అనుభవించిన భారత్‌లో ఈ ఏడాది పరిస్థితులు మరింత దయనీయంగా తయారయ్యాయి. ఏప్రిల్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ప్రజలు బెంబేలెత్తే పరిస్థితి తలెత్తింది. ఏప్రిల్‌ 1వ తేదీన దేశవ్యాప్తంగా 81,466 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, ఏప్రిల్‌ 30వ తేదీ నాటికి పాజిటివ్‌ కేసుల సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా 4,01,993కు చేరింది. వైరస్‌ సంక్రమణ దేశంలో ఎంత వేగంగా ఉందో ఈ నెల రోజుల గణాంకాలే స్పష్టంచేస్తున్నాయి. ఏప్రిల్‌లో దేశంలో 69,43,284 మంది కరోనా బారినపడ్డారు. అదే సమయంలో దేశంలో వైరస్‌ కారణంగా 48,926 మంది ప్రాణాలు కోల్పోయారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఏప్రిల్‌ నెలలో 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 11,37,120 పాజిటివ్‌ కేసులు రాగా, 6,348మంది మరణించారు. అదే ఏప్రిల్‌ 11వ తేదీ నుంచి ఏప్రిల్‌ 20 వరకు 22,57,352 మందికి వైరస్‌ నిర్ధారణ జరుగగా, 13,278 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఏప్రిల్‌ 21వ తేదీ నుంచి కరోనా దేశంలో విలయతాండవం చేయడం ప్రారంభించింది. 21వ తేదీ నుంచి దేశంలో ప్రతీ రోజు 3లక్షలకు పైగా కరోనా సంక్రమణ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 21వ తేదీ నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ మధ్య 10 రోజుల వ్యవధిలో 35,48,839 కరోనా పాజిటివ్‌ కేసులు రాగా, 29,300 మంది కరోనాతో పోరాడి ఓడిపోయి తుదిశ్వాస విడిచారు. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులలో విలవిల్లాడిపోయినా అమెరికా, బ్రెజిల్‌ వంటి దేశాలను సైతం భారత్‌ వెనక్కి నెట్టేసింది. ఏప్రిల్‌ నెలలో అమెరికాలో 18,86,000 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, బ్రెజిల్‌లో 19,13,264 పాజిటివ్‌ కేసులను గుర్తించారు.

మరిన్ని వార్తలు