దీటుగా బదులిస్తాం: ఆర్మీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

12 Jan, 2021 16:53 IST|Sakshi

న్యూఢిల్లీ: పొరుగు దేశాలు పాకిస్తాన్‌, చైనాతో దేశానికి ముప్పు పొంచి ఉందని, అయితే సరైన సమయంలో స్పందించడం ద్వారా వారి పన్నాగాలను తిప్పికొట్టవచ్చని భారత సైనిక దళాల ప్రధానాధికారి మనోజ్‌ ముకుంద్‌ నరవాణే అన్నారు. భారత్‌ను ఇరుకున పెట్టేవిధంగా ఇరు దేశాల మధ్య రహస్య ఒప్పందాలు జరిగాయని, ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని నిర్లక్ష్యం చేయలేమని పేర్కొన్నారు. ఆర్మీ డే(జనవరి 15) సమీపిస్తున్న నేపథ్యంలో జనరల్‌ నరవాణే మంగళవారం పత్రికా సమావేశం(వార్షిక) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోంది. మనం మాత్రం టెర్రరిస్టుల పట్ల ఉక్కుపాదం మోపుతున్నాం. సరైన సమయంలో సరైన చోట సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టమైన సందేశం ఇస్తున్నాం’’ అని ప్రత్యర్థి దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. (చదవండి: 20 లక్షల కోసం ఆర్మీ కెప్టెన్‌ దురాగతం)

అదే విధంగా.. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్‌-19ను ఎదుర్కోవడం అతిపెద్ద సవాలు అన్న ఆర్మీ చీఫ్‌ నరవాణే.. ‘‘ఉత్తర సరిహద్దుల్లో అత్యవసర పరిస్థితి విధించి బలగాలను అప్రమత్తం చేశాం. శాంతియుతమైన పరిష్కారం కనుగొనడానికి మేం సహకరిస్తాం. అయితే అదే పరిస్థితుల్లో దీటుగా బదులిచ్చేందుకు కూడా సన్నద్ధమై ఉన్నాం. సమీప భవిష్యత్తులో రక్షణ రంగంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు సాంకేతిక సహకారం అందిపుచ్చుకునే దిశగా ప్రణాళికను సిద్ధం చేసి పెట్టుకున్నాం’’ అని తెలిపారు. ఇక చైనాతో తూర్పు లదాఖ్‌లో ఉద్రిక్తతల గురించి ప్రస్తావిస్తూ.. భారత్‌- చైనా వాస్తవాధీన రేఖ వద్ద మోహరించిన బలగాల సంఖ్యలో ఎటువంటి మార్పు లేదని స్సష్టం చేశారు. ఇరు దేశాలు పరస్పర చర్చలు, సహకారంతో ఈ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాయనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం తూర్పు లదాఖ్‌లో సుమారు 50 వేల భారత బలగాలు ఉన్నట్లు సమాచారం.

>
మరిన్ని వార్తలు