దేనికైనా సిద్ధంగా ఉన్నాం: నరవణే

5 Sep, 2020 03:23 IST|Sakshi
శుక్రవారం లద్దాఖ్‌లో ఆర్మీ కమాండర్లతో పరిíస్థితులను సమీక్షిస్తున్న జనరల్‌ ఎం.ఎం.నరవణే

న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఉద్రిక్తత నెలకొందని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవణే అన్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యూహాత్మక మోహరింపులు చేశామని, మన సరిహద్దులను, ప్రాదేశిక సమగ్రతను కాపాడటానికి పూర్తి సంసిద్ధులై ఉన్నామని తెలిపారు. దేశం తమపై పూర్తి విశ్వాసం ఉంచవచ్చన్నారు.

లద్దాఖ్‌లో నరవణే శుక్రవారం రెండోరోజు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. పలు ఆర్మీ పోస్టులను సందర్శించి... సైనికులు, సీనియర్‌ కమాండర్లతో మాట్లాడారు. అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ‘మన సైనికులు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. దేశ భౌగోళిక సమగ్రతను కాపాడటానికి వారు పూర్తి సంసిద్ధంగా ఉన్నారనే విశ్వాసం నాకు కలిగింది’అని చెప్పారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్యపరమైన చర్చలతో సహా అన్ని మార్గాలను ఉపయోగించుకుంటామన్నారు.

ఐదురోజుల కిందట తూర్పు లద్ధాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు దక్షిణతీరంలో చైనా దుస్సాహసంతో అతిక్రమణకు దిగగా... భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. వేగంగా స్పందించిన భారత్‌ అదనపు బలగాలను, ఆయుధ సామగ్రిని ఈ ప్రాంతానికి తరలించి పాంగాంగ్‌ సరస్సు దక్షిణతీరంలోని కీలక పర్వత ప్రాంతాల్లో మోహరించింది. ఫింగర్‌ 2, ఫింగర్‌ 3 ప్రాంతాల్లో ఆర్మీపోస్టులను బలోపేతం చేసింది. కమాండర్ల చర్చల్లో దీనిపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా... తమ భూభాగంలోనే మోహరించామని, వెనక్కితగ్గే ప్రసక్తేలేదని భారత్‌ తేల్చిచెప్పింది.

దశాబ్దాల్లో అతిపెద్ద సవాల్‌: ష్రింగ్లా
లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు గడిచిన కొన్ని దశాబ్దాల్లో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్‌గా భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింగ్లా అభివర్ణించారు. దేశ భౌగోళిక సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి పూర్తి కంకణబద్ధులమై ఉన్నామని తెలిపారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి సిద్ధమని,  అన్నిరకాలుగా ప్రయత్నం చేస్తున్నామన్నారు.   

మరో దఫా మిలిటరీ చర్చలు
భారత్‌– చైనాల మధ్య మరోదఫా మిలిటరీ చర్చలు జరిగాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించడానికి తూర్పు లద్దాఖ్‌లోని చుషుల్‌లో శుక్రవారం బ్రిగేడ్‌ కమాండర్‌ స్థాయి చర్చలు జరిగాయి. చర్చల్లో పురోగతి ఏంటనేది వెంటనే తెలియరాలేదు.  
 

మరిన్ని వార్తలు