శిక్షణ పూర్తి చేసుకున్న ఆర్మీ జాగిలాలు

9 Feb, 2021 18:04 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా సోకిందో లేదో అనేది చిన్న పరీక్షతో తేలనుంది. వైద్యలు అవసరం లేకుండా మన జాగిలాలు గుర్తిస్తున్నాయి. సైన్యానికి చెందిన కుక్కలు ఎవరికి కరోనా సోకిందో.. ఎవరికీ లేదో చెబుతున్నాయి. ఈ మేరకు జాగిలాలకు సైనిక అధికారులు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో మొత్తం 3,800 నమూనాలు పరీక్షించగా వాటిలో 22 పాజిటివ్స్‌ను ఆ జాగిలాలు గుర్తు పట్టాయి.

ఒక డబ్బాలోని మూత్రం (యూరిన్) శాంపిల్ వేస్తే.. దాని వాసన చూసి క‌రోనా పాజిటివా కాదా కుక్క చెప్పేస్తోంది. భారత సైన్యానికి చెందిన ఈ జాగిలం పేరు కాస్పర్‌. రెండేళ్ల వయసున్న దీని ముందు తీసుకున్న శాంపిళ్లను డబ్బాల్లో వేసి ఉంచగా వాటిలో పాజిటివ్‌ ఉన్న డబ్బాను ఎంచుకుంటుంది. దీంతో మిగతా డబ్బాల వారికి కరోనా సోకలేదని నిర్ధారించుకోవచ్చు. ఇంకో జాగిలం కూడా ఉంది. దాని పేరు జయ. ఏడాది వయసున్న ఈ కుక్క త‌న ముక్కుతో కోవిడ్‌ సోకిన వారి నమూనాలను గుర్తిస్తోంది.

ఈ రెండు శునకాలు ఇప్ప‌టికే 3,800 నమూనాలను ప‌రీక్షించాయి. వీటిలో 22 పాజిటివ్‌గా తేలాయి. కొన్ని సెక‌న్ల‌లోనే అవి ఫలితం ఇస్తుండడంతో అధికారులు వాటిని అభినందిస్తున్నారు. పాజిటివ్ కేసు ఉన్న శాంపిల్‌ను ఆ జాగిలాలు గుర్తించి వాటి పక్కన నిల్చుంటున్నాయి. దీంతో ఆ డబ్బాలో ఉన్న నమూనాకు సంబంధించిన  వ్యక్తి కోవిడ్‌ సోకిందని నిర్ధారిస్తున్నారు. ఈ విధంగా జాగిలాలను వైద్యపరంగా కూడా వినియోగిస్తున్నారు.

గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో అధికారులు మూత్రం, చెమ‌ట వాస‌నతో కరోనా పాజిటివ్‌ కేసులను గుర్తించడంపై శిక్ష‌ణ ఇస్తున్నారు. ఈవిధంగా రెండూ జాగిలాలు సిద్ధం కాగా.. మరొకటి శిక్షణ పొందుతోంది. దాని పేరు మ‌ణి. ఈ జాగిలాల‌ను ల‌ఢక్‌, క‌శ్మీర్‌లాంటి ప్రాంతాల్లో పని చేసే జ‌వాన్ల‌ శాంపిళ్లను గుర్తించేందుకు వినియోగించనున్నారు.  ప్రస్తుతం చండీగ‌ఢ్ క్యాంప్‌లో ఈ జాగిలాలు ఈ ప‌ని చేస్తున్నాయి. ఈ విధంగా ఇంకా 8 జాగిలాల‌కు శిక్ష‌ణ ఇస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి విధానం బ్రిట‌న్‌, ఫిన్లాండ్‌, ర‌ష్యా, ఫ్రాన్స్‌, యూఏఈ, జ‌ర్మ‌నీ, లెబ‌న‌న్‌ వంటి దేశాల్లో అమల్లోకి వచ్చింది.

మరిన్ని వార్తలు