Jammu And Kashmir: కశ్మీర్‌ సరిహద్దుల్లో కూలిన ఆర్మీ హెలికాప్టర్‌

11 Mar, 2022 16:42 IST|Sakshi

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌ సరిహద్దుల్లో సమీపంలో భారత ఆర్మీ హెలికాప్టర్‌ కూలింది. ఉత్తర కశ్మీర్‌లోని బందిపొర జిల్లా గురేజ్‌ సెక్టార్‌లోని గజ్రాన్‌ నల్లాహ్‌ వద్ద ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌కు అతి దగ్గర్లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అస్వస్థతకు గురైన ఓ బీఎస్ఎఫ్ జవాన్‌ను తీసుకొచ్చేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో పైలట్‌, కో-పెలట్‌ ఉన్నట్లు తెలిపారు.  

ల్యాండింగ్ కోసం హెలికాప్టర్ ప్రయత్నించినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో వెనక్కి మళ్లినట్లు ఓ అధికారి చెప్పినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. అయితే  ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి రెస్క్యూ బృందాలు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా ప్రమాదంలో పైలట్‌ మృతిచెందినట్లు, కో పైలట్‌ గాయాలతో బయటపడినట్లు  తెలుస్తోంది. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చదవండి: ఆమ్‌ ఆద్మీ పార్టీకి మోదీ అభినందనలు.. కేజ్రీవాల్‌ రిప్లై ఇదే

మరిన్ని వార్తలు