1984లో గల్లంతైన ఆర్మీ జవాన్‌ మృతదేహం లభ్యం

15 Aug, 2022 19:59 IST|Sakshi

న్యూఢిల్లీ: మంచు తుపాను కారణంగా గల్లంతైన జవాను ఆచూకీ 38 ఏళ్ల తర్వాత లభ్యమైంది. సియాచిన్​ వద్ద హిమాలయాల్లో ఓ మంచుదిబ్బ వద్ద రెండు మృతదేహాల్ని జవాన్లు కనుగొన్నారు. అక్కడే లభించిన ఐడెంటిఫికేషన్ డిస్క్​పై ఉన్న సంఖ్య ఆధారంగా ఆ అమర సైనికుడిని లాన్స్ నాయక్ చంద్రశేఖర్‌గా గుర్తించింది రాణిఖేట్‌లోని సైనిక్‌ గ్రూప్‌ సెంటర్‌. 

19 కుమావోన్ రెజిమెంట్‌లో సభ్యుడైన చంద్రశేఖర్ హర్బోలా స్వస్థలం ఉత్తరాఖండ్​ అల్మోరా జిల్లాలోని ద్వారాహట్. 1975లో సైన్యంలో చేరారు. లాన్స్​ నాయక్ హోదాలో భారత సైన్యంలో పని చేశారు. 1984లో 'ఆపరేషన్ మేఘ్​దూత్​'లో భాగంగా పాకిస్థాన్‌తో పోరాడేందుకు చంద్రశేఖర్ సహా మొత్తం 20 మంది జవాన్ల బృందాన్ని రంగంలోకి దింపింది భారత సైన్యం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రం సియాచిన్‌లో వారిని మోహరించింది. మే 29వ తేదీన ఒక్కసారిగా మంచు తుపాను విరుచుకుపడింది. చంద్రశేఖర్ సహా మొత్తం 20 మందిని మంచు రక్కసి మింగేసింది. సైన్యం 15 మంది మృతదేహాల్ని వెలికితీసింది. ఎంత ప్రయత్నించినా మిగిలిన ఐదుగురి ఆచూకీ దొరకలేదు. అందులో చంద్రశేఖర్‌ ఒకరు. 

చంద్రశేఖర్​ గల్లంతు కావడానికి 9 ఏళ్ల ముందు.. అల్మోరాకు చెందిన శాంతి దేవితో ఆయనకు వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు(వయసు 4 ఏళ్లు, ఏడాదిన్నర). అప్పుడు శాంతి దేవి వయసు 28 సంవత్సరాలు. అప్పటినుంచి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు ఆయన పరిస్థితి ఏంటో తెలియకుండానే గడుపుతున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్​ హల్​ద్వానీలో నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్‌ మృతదేహం సోమవారం రాత్రికి స్వగ్రామం చేరుకోనుంది. హల్‌ద్వానీ సబ్ కలెక్టర్‌ మనీశ్‌ కుమార్‌, తహసీల్దార్‌ సంజయ్‌ కుమార్‌.. జవాను ఇంటికి వెళ్లారు. పూర్తిస్థాయి మిలిటరీ గౌరవంతో అత్యక్రియలను నిర్వహిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి: అట్టారీ-వాఘా సరిహద్దుల్లో అట్టహాసంగా బీటింగ్‌ రీట్రీట్‌ వేడుకలు

మరిన్ని వార్తలు