17మంది అమాయకులు బలి.. ఇంకెన్నాళ్లీ చట్టం? 

6 Dec, 2021 10:03 IST|Sakshi

సాక్షి, నేషనల్‌ డెస్క్‌: వచ్చిందెవరో ధ్రువీకరించుకోకుండానే... వారి వద్ద ఆయుధాలున్నాయా? దాడికి ప్రయత్నిస్తున్నారా? అనేవి ఏవీ చూడకుండా పనులకెళ్లి తిరిగి వస్తున్న కూలీలపై ఆర్మీ జవాన్లు కాల్పులకు తెగబడటం విభ్రాంతికలిగించింది. బొగ్గు గనిలో పని పూర్తిచేసుకొని పాటలు పాడుకుంటూ వాహనంలో ఇళ్లకు తిరిగి వస్తున్న కార్మికులపై సైనికులు తుపాకులు ఎక్కుపెట్టారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య 17కే చేరింది.

అయితే ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటి దారుణాలు కొత్తేమీ కాదు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) కట్టబెట్టిన అపరిమిత అధికారాలతోనే సైన్యం ఇలాంటి అతిక్రమణలకు, హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. తిరుగుబాట్లను, వేర్పాటువాదాన్ని, నిషేధిత ఉగ్రసంస్థలను అణచివేసే చర్యల పేరిట అమాయాకుల ఊచకోత, మహిళలపై సైన్యం అకృత్యాలు చేసిన దృష్టాంతాలెన్నో ఉన్నాయి.

ఈ నిరంకుశ చట్టాన్ని ఉపసంహరించాలని ఇక్కడి పౌర సమాజం, హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులు ఎన్నో ఏళ్లుగా గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో అశాంతిని, అలజడులను నియంత్రించడం రాష్ట్ర ప్రభుత్వాల యం త్రాంగాలకు సాధ్యం కాకపోవడంతో ఆరు దశాబ్దాల కిందట 1958లో కేంద్ర ప్రభుత్వం ‘ఏఎఫ్‌ఎస్‌పీఏ’ చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం... 
►కల్లోలిత ప్రాంతంగా ప్రకటించిన ప్రదేశాల్లో శాంతిభద్రతలను కాపాడే అధికారం సైనిక బలగాలకు దఖలు పడుతుంది. 
►ఐదుగురికి మించి ఒకేచోట గుమిగూడకుండా ఆర్మీ నిషేధం విధించగలదు. 
►ఎవరైనా ఈ ఆజ్ఞలను ఉల్లంఘించారని భావిస్తే బలప్రయోగం ద్వారా నియంత్రించొచ్చు. ముందస్తు హెచ్చరిక జారీచేసి కాల్పులూ జరపొచ్చు. 
►సమంజసమైన అనుమానం ఉంటే వారెంటు లేకుండానే ఎవరినైనా అరెస్టు చేయవచ్చు. అరెస్టుకు కారణాలను వివరిస్తూ తర్వాత సమీపంలోని పోలీసుస్టేషన్‌లో సదరు వ్యక్తిని లేదా వ్యక్తులను అప్పగించవచ్చు. 
►వారెంటు లేకుండానే ఎవరి ఇంట్లోకైనా ప్రవేశించి సోదాలు జరపొచ్చు. 
►ఆయుధాలు కలిగి ఉండటాన్ని నిషేధించొచ్చు. 

ఏది కల్లోలిత ప్రాంతమంటే... 
భిన్న మతాలు, జాతులు, భాషలు, కులాలు, ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగి ఘర్షణలు తలెత్తితే... ఆ ఏరియాను ‘కల్లోలిత ప్రాంతం’గా ప్రకటించే వీలును ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టంలోని సెక్షన్‌–3 కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం (హోంశాఖ), లేదా రాష్ట్ర గవర్నర్‌ మొత్తం రాష్ట్రాన్ని లేదా కేంద్ర పాలిత ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించొచ్చు. శాంతిభద్రతలను కాపాడటానికి రాష్ట్ర యంత్రాంగానికి సైనిక బలగాల సాయం అవసరమైన చోట్ల ఈ చట్టాన్ని ప్రయోగించవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏఎఫ్‌ఎస్‌పీఏను ప్రయోగించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికే వదిలివేయవచ్చు. 

ఎక్కడెక్కడ అమలులో ఉంది? 
అస్సాం, నాగాలాండ్, మణిపూర్‌ (మణిపూర్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ ఏరియాను మినహాయించి), అరుణాచల్‌ప్రదేశ్‌లోని చాంగ్‌లాంగ్, లాంగ్‌డింగ్, తిరప్‌ జిల్లాల్లో ఈ చట్టం అమలులో ఉంది. నాగాలాండ్‌లో డిసెంబరు 31 దాకా దీన్ని పొడిగిస్తూ ఈ ఏడాది జూన్‌ 30నే ఆదేశాలు జారీ అయ్యాయి. అస్సాంలో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 11న మరో ఆరునెలలు ఈ చట్టం అమలును పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. మేఘాలయలో ఏప్రిల్‌ 1, 2018న ఈ చట్టాన్ని కేంద్రం ఎత్తివేసింది.

16 ఏళ్ల పోరాటం 
ఇరోమ్‌ షర్మిల... మణిపూర్‌ ఉక్కుమహిళగా ఖ్యాతికెక్కిన ఈ పేరు చిరపరిచితమే. 2000 నవంబరులో మణిపూర్‌లోని మలోమ్‌ పట్టణంలో బస్సు కోసం వేచిచూస్తున్న 10 మంది సాధారణ పౌరులను అస్సాం రైఫిల్స్‌ దళం కాల్చి చంపింది. ఈ మలోమ్‌ ఊచకోతకు నిరసనగా, ఏఎఫ్‌ఎస్‌పీఏను ఉపసంహరించాలనే డిమాండ్‌తో 28 ఏళ్ల ఇరోమ్‌ షర్మిల నిరాహార దీక్షకు దిగారు. మూడు రోజులకే ఆత్మహత్యకు ప్రయత్నించిందనే అభియోగంపై ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. 2000 నవంబర్‌ నుంచి 2016 ఆగస్టు దాకా పోలీసు కస్టడీలోనే ఇరోమ్‌ షర్మిల నిరాహారదీక్షను కొనసాగించారు.

ఈ సమయంలో ట్యూబ్‌  ద్వారా ఆమెకు బలవంతంగా ద్రవాహారం అందించారు. కేంద్రం ఈ చట్టాన్ని ఎంతకీ ఉపసంహరించుకోకపోవడంతో ఆమె మనసు మార్చుకొని 2016 ఆగస్టు 9న తన దీక్షను విరమించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఇరోమ్‌ సొంత పార్టీ పెట్టి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాటి మణిపూర్‌ సీఎం ఓక్రమ్‌ ఇబోబీ సింగ్‌పై పోటీచేశారు. కేవలం 90 ఓట్లు మాత్రమే పడ్డాయి. తమ ప్రజలపై అకృత్యాలను ఎండగడుతూ... ప్రపంచం దృష్టిని అకర్షించి, ఏకధాటిగా 16 ఏళ్లు దీక్ష చేసినా... సొంత జనమే ఆదరించలేదు. సాయుధ బలగాల అకృత్యాలకు ఊతమిచ్చే ఈ నిరంకుశ చట్టం ఇంకా కొనసాగుతూనే ఉంది. 
 

మరిన్ని వార్తలు