బాలికపై పాశవికం.. ఆర్మీ మేజర్ దంపతుల వికృత చేష్టలు

27 Sep, 2023 12:31 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అసోం: ఓ బాలికపై ఆర్మీ మేజర్, ఆయన భార్య వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఇంట్లో పనిచేసే పదహారేళ్ల బాలికను పాశవికంగా వేధింపులకు గురిచేశారు. బాలిక శరీరంపై ఎక్కడ చూసిన కాల్చిన వాతలు కన్పించాయి. పళ్లు ఊడిపోయాయి. ముక్కు, నాలుక భాగాల్లో బలమైన దెబ్బలు కనిపించాయి. ఆ బాలికను దాదాపుగా నగ్నంగా ఉంచుతున్నారని పోలీసులు తెలిపారు. 

ఇంట్లో పనులు చేయిస్తూనే గత ఆర్నెళ్లుగా వేధింపులకు గురిచేసినట్లు పోలీసులు తెలిపారు. ఆహారం సరిగా ఇవ్వకుండా బాలికను బక్కచిక్కిపోయేలా చేశారు. ఆహారం కూడా చెత్తకుప్పలో నుంచి ఏరుకుని తినేలా చేసి పాశవిక ఆనందాన్ని పొందినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. నగ్నంగా ఉంచి రక్తం వచ్చేలా కొట్టేవారని వెల్లడించింది. గదిలో బందించి క్రూరంగా హింసించేవారని బాధితురాలు పేర్కొంది.

పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడు ఆర్మీలో మేజర్‌గా పనిచేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అసోం నుంచి వెళ్లినప్పుడు ఓ బాలికను ఇంట్లో పనిచేయడానికి తీసుకువెళ్లారు. హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి అసోంకి తిరిగివచ్చిన క్రమంలో బాలిక తన కుటుంబాన్ని కలిసింది. ఈ క్రమంలో విషయాన్ని తెలుసుకున్న బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పదహారేళ్ల వయసులో ఉన్న తన కూతురును వృద్ధురాలిగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. 

ఇదీ చదవండి: అమానవీయం.. రోడ్డుపై అత్యాచార బాధితురాలు, సాయం కోరినా కనికరించని వైనం


 


 

మరిన్ని వార్తలు