జెట్టీలు ధ్వంసం, యుద్ధట్యాంకులు వెనక్కి

17 Feb, 2021 01:02 IST|Sakshi
పాంగాంగ్‌ సరస్సు తీర ప్రాంతం నుంచి వెనుదిరుగుతున్న చైనా బలగాలు

జెట్‌ స్పీడ్‌తో చైనా బలగాల ఉపసంహరణ

వీడియోలు విడుదల చేసిన భారత ఆర్మీ  

న్యూఢిల్లీ: శిబిరాలు తీసేస్తున్నారు. జెట్టీలు ధ్వంసం చేస్తున్నారు. హెలిప్యాడ్‌లను తొలగిస్తున్నారు. యుద్ధ ట్యాంకుల్ని వెనక్కి మళ్లిస్తున్నారు. భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత 10 నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతల నివారణకు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చైనా అందరినీ ఆశ్చర్య పరిచేలా వాయువేగంతో ఉపసంహరణ పూర్తి చేస్తోంది. పాంగాంగ్‌ సరస్సుకి తూర్పుగా ఫింగర్‌ 8వైపు చైనా దళాలు మళ్లుతూ ఉంటే, భారత్‌కు చెందిన దళాలు ఫింగర్‌ 3లోని శాశ్వత శిబిరంలో ఇకపై ఉంటారు. ఈ మధ్య ప్రాంతాన్ని నో మ్యాన్‌ ల్యాండ్‌ కింద ప్రకటించారు. అంటే ఆ ప్రాంతంలో ఏ దేశ సైనికులు కూడా పెట్రోలింగ్‌ నిర్వహించకూడదు. అనుకున్న మాటకి కట్టుబడి చైనా సైన్యం వెనక్కి మళ్లుతుండడానికి సంబంధించిన పలు వీడియోలను భారత ఆర్మీ మంగళవారం విడుదల చేసింది.

చైనా వాయువేగంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తోంది. ఉపసంహరణ కార్యక్రమం ఇదే స్థాయిలో కొనసాగితే పాంగాంగ్‌ సరస్సు వెంబడి ఉన్న సైనిక ఉపసంహరణ మరొక్క రోజులోనే ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నాయి. గత ఏడాది ఏప్రిల్‌ నుంచే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. చైనా జవాన్లు జూన్‌లో భారత్‌ సైనికులపై దాడికి దిగడంతో సంక్షోభం మరింత ముదిరింది. చర్చల ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకోవాలని భారత్‌ భావించినా చైనా మొదట్లో సహకరించలేదు. ఎట్టకేలకు గత నెల 24న తొమ్మిదో రౌండు కమాండర్‌ స్థాయి చర్చల్లో బలగాలను ఉపసంహరించాలన్న నిర్ణయానికి వచ్చారు. గత వారంలోనే ఈ ఉపసంహరణ కార్యక్రమం మొదలైనప్పటికీ డ్రాగన్‌ దేశం ఇప్పుడు మరింత ముమ్మరం చేసింది.  

క్రేన్ల సాయంతో అన్నీ ధ్వంసం  
చైనా తమ దేశానికి చెందిన 200 యుద్ధ ట్యాంకుల్ని కేవలం ఎనిమిది గంటల వ్యవధిలో 100 కి.మీ. మళ్లించారు. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సదస్సు ఉత్తర, దక్షిణ తీరాల వెంబడి ఉన్న బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి. గత పది నెలలుగా ఎదురెదురుగా ఉన్న ఇరు దేశాలకు చెందిన సైన్యం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరాలను ఎత్తేస్తున్నారు. యుద్ధ ట్యాంకులను వెనక్కి మళ్లిస్తున్నారు. భారత ఆర్మీ విడుదల చేసిన వీడియోల్లో చైనా సైనికులు జెట్టీలు, బంకర్లను ధ్వంసం చేసి బరువైన ఆయుధాలను మోసుకుంటూ పర్వతాల వెంబడి నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు ఉన్నాయి. ఇక శిబిరాలను తొలగించడానికి భారీ క్రేన్లను వాడుతున్నారు.

ఏప్రిల్‌ 2020 తర్వాత నిర్మించిన కట్టడాలన్నీ ధ్వంసం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని భారతీయ ఆర్మీ నిరంతరం పర్యవేక్షిస్తోంది. మానవరహిత ఏరియల్‌ వెహికల్స్, ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా ఈ మొత్తం ప్రక్రియను రికార్డు చేస్తోంది. తొలి విడత బలగాల ఉపసంహరణ పూర్తి కావడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ప్రసుతం ఇరువైపులకి చెందిన యుద్ధట్యాంకులు 100 వరకు మోహరించి ఉన్నాయి. చైనా వాయువేగంతో ఉపసంహరణ పూర్తి చేస్తున్నప్పటికీ ఆ దేశాన్ని పూర్తిగా నమ్మే పరిస్థితి అయితే లేదు. ‘‘చైనా వెనక్కి తగ్గింది. కానీ ఆ దేశం పట్ల ఉన్న అపనమ్మకం ఇంకా అలాగే ఉంది’’అని రాజకీయ విశ్లేషకుడు పథిక్రిత్‌ పైనే అన్నారు.  

>
మరిన్ని వార్తలు