మహిళా కానిస్టేబుల్‌పై‌ దాడి..అర్నాబ్‌పై మరో కేసు!

4 Nov, 2020 19:36 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న అన్వే నాయక్‌ భార్య, కూతురు

మహారాష్ట్ర పోలీసులకు ధన్యవాదాలు

అర్నాబ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

అన్వే నాయక్ కుటుంబ సభ్యులు

ముంబై : ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్‌ గోస్వామిని అరెస్ట్‌ చేయడాన్ని ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ కుటుంబ సభ్యులు స్వాగతించారు. అర్నాబ్‌ని అరెస్ట్‌ చేసి తమకు న్యాయం చేశారని అన్వే నాయక్‌ భార్య అక్షత, కూతురు అద్య్నా నాయక్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం వారు మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర ఆడపడుచుకు ఇచ్చిన మాటను పోలీసులు నిలబెట్టుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. అర్నాబ్‌పై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.  
(చదవండి : రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్‌ గోస్వామి అరెస్టు)

కాగా,  రిపబ్లిక్ టీవీ స్టూడియోలను రూపొందించిన డిజైనర్ అన్వే నాయక్.. 2018లో తన తల్లి కుముద్‌ నాయక్‌తో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. బిల్లులు చెల్లించకపోవడంతోనే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారన్న కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో అర్నాబ్‌పై రాయ్‌గడ్‌లో కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్థానిక రాయ్‌గడ్ పోలీసులు గోస్వామితో సహా సూసైడ్ నోట్‌లో పేర్కొన్న నిందితులపై తమకు ఆధారాలు దొరకలేదని 2019 ఏప్రిల్‌లో కేసును మూసివేశారు. అయితే, ఈ ఏడాది మేలో, అన్వే కుమార్తె ఈ కేసుపై తిరిగి దర్యాప్తు చేయాలని కోరుతూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌ను ఆశ్రయించడంతో మళ్లీ ఈ కేసు తెరపైకి వచ్చింది. అయితే మన విజ్ఞప్తికి స్పందించి అర్నాబ్‌ను అరెస్ట్‌ చేసినందుకు మహారాష్ట్ర పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. 
(చదవండి : ఎమర్జెన్సీని గుర్తు చేసింది : అమిత్‌షా)

‘ నా భర్త సూడైడ్‌ నోట్‌లో ముగ్గురి పేర్లు ఉన్నాయి. ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని 2018 నుంచి మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. నా భర్త ఆత్మహత్య వెనుక అర్నాబ్‌ గోస్వామి హస్తం ఉంది. అతనిపై చర్యలు తీసుకోని మాకు న్యాయం చేయాలి. అర్నాబ్‌కు ఒక్కరు కూడా సహాయం చేయొద్దని భారతీయులందరికి విజ్ఞప్తి చేస్తునా. మహారాష్ట్ర పోలీసులు మాకు న్యాయం చేశారు. అర్నబ్‌ని అరెస్ట్‌ చేసిన పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం’ అని అన్వే నాయక్‌ భార్య అక్షత మీడీయాతో పేర్కొన్నారు. 

‘ మా నాన్న తన డబ్బు, శ్రమను రిపబ్లిక్ టీవీ స్టూడియో ప్రాజెక్టు కోసం ఖర్చు చేశాడు. ఇవన్నీ ఉన్నప్పటికీ, గోస్వామి నా తండ్రికి బకాయిలు అందకుండా చూసుకున్నాడు. డబ్బులు అడిగితే మా నాన్న కెరీర్‌తో పాటు నా కెరీర్‌ను నాశనం చేస్తాని బెదిరించాడు. అందుకే మా నాన్న చనిపోయాడు’ అని అన్వే నాయక్‌ కూతురు అద్న్యా అన్నారు. 

అర్నాబ్‌పై మరో కేసు 
ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్‌ ఆత్మహత్య కేసులో అరెస్టయిన రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్‌ గోస్వామి మరో కేసు నమోదైంది. అరెస్ట్‌ సమయంలో అర్నాబ్‌ ఇంటికి వచ్చిన మహిళా కానిస్టేబుల్‌పై ఆయన దాడికి పాల్పాడ్డారని మహారాష్ట్ర పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు