అర్నాబ్‌ గోస్వామి అరెస్ట్‌ అన్యాయమేనా!?

9 Nov, 2020 15:21 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రిపబ్లిక్‌ టీవీ స్టార్‌ యాంకర్, ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నాబ్‌ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్‌ చేయడం పట్ల ఆయన అభిమానులతోపాటు మరి కొంత మంది వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ‘ఇది పత్రికా స్వేచ్ఛ పై జరిగిన దాడి, భావ ప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగ హక్కు’ అంటూ కొందరు  కేంద్ర మంత్రుల దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు విమర్శిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాకరేతోపాటు ఆయన మంత్రివర్గ సహచరులను, ముంబై పోలీసు కమిషనర్‌ పరమ్‌ బీర్‌ సింగ్‌లను విమర్శించినందుకు గోస్వామిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

అర్నాబ్‌ గోస్వామిని అరెస్ట్‌ చేయడం అన్యాయమేనా? అది పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం అవుతుందా? బాలీవుడు వర్ధమాన నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో బాలీవుడ్‌ తార రియా చక్రవర్తిని అరెస్ట్‌ చేయాలంటూ కొన్ని నెలలపాటు అర్నాబ్‌ గోస్వామి తన టీవీ ఛానెల్‌ ద్వారా గోల చేసిన విషయం తెల్సిందే. రియా చక్రవర్తిని అనుమానితురాలిగా ముందుగా అరెస్ట్‌ చేసిన ముంబై పోలీసులు ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు లేవంటూ వదిలేశారు. తన ఆత్మహత్యకు ఫలానా, ఫలానా వారు బాధ్యులంటూ సుశాంత్‌ ఎలాంటి ఆత్మహత్య లేఖలో పేర్కొనలేదు. అయినప్పటికీ ఆమె కారణంగానే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నారని, రియా చక్రవర్తిని అరెస్ట్‌ చేసి, కేసు పెడితేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయంటూ గోస్వామి పదే పదే డిమాండ్‌ చేశారు. 

అలాంటి వ్యక్తిని 2018 నాటి ఇంటీరియర్‌ డిజైనర్‌ ఆత్మహత్య కేసులో అరెస్ట్‌ చేయడం తప్పెలా అవుతుంది ? పైగా ఆ డిజైనర్‌ తనకు అర్నాబ్‌ గోస్వామి, ఆయన ఇద్దరు మిత్రులు ఇవ్వాల్సిన దాదాపు ఐదు కోట్ల రూపాయలను చెల్లించక పోవడం వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, సూసైడ్‌ నోట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కారణంగానే ఆ డిజైనర్‌ తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే రియా అరెస్ట్‌ను పదే పదే డిమాండ్‌ చేసిన గోస్వామికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు కూడా ఉన్నప్పుడు అరెస్ట్‌ చేయకూడదా ? అది రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనా?

సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్, విరసం కవి వరవర రావు, జర్నలిస్ట్‌ సిద్ధిక్‌ కప్పన్‌తోపాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో అనేక మంది జర్నలిస్టులను అనేక కేసుల్లో అరెస్ట్‌ చేసి నిర్బంధించగా, కొన్నేళ్లుగా వారు బెయిల్‌ దొరక్క జైళ్లలో అలమటిస్తున్నారు. నేడు గోస్వామి అరెస్ట్‌ను ఖండిస్తున్నావారు వారి నిర్బంధాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నదే ఇక్కడ ప్రశ్న. క్వారంటైన్‌లో ఉన్న గోస్వామి తన మిత్రుడి సెల్‌ఫోన్‌ ద్వారా తన వారందరితో మంతనాలు జరుపుతున్నారనే ఫిర్యాదుపై పోలీసులు ఆ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకొని క్వారంటైన్‌ నుంచి ఆదివారం తెల్లవారు జామున తలోజి జైలుకు పంపించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాను తన న్యాయవాదులతో ఫోన్‌లో కూడా సంప్రతించేందుకు వీల్లేకుండా తనను అన్యాయంగా జైలుకు తరలించారంటూ గోస్వామి కూడా మీడియాతో మొరపెట్టుకున్నారు. 

ఒక్క గోస్వామికే కాదు, ఆయన స్థానంలో ఓ సామాన్యుడు ఉన్నా న్యాయవాదులను సంప్రతించేందుకు ఫోన్‌ అనుమతించడం కూడా రాజ్యాంగం కల్పిస్తున్న హక్కే. సెల్‌ఫోన్‌ను అనుమతించకపోయినా జైల్లో ఉండే ఫోన్లను అనుమతించాల్సిందేగదా!? పారిపోయే అవకాశం లేనందునా గోస్వామికైనా ఈ కేసులో బెయిలివ్వాల్సిందే. ‘బెయిల్‌ నాట్‌ జెయిల్‌’ అన్న అర్నాబ్‌ నినాదంలో నిజం లేకపోలేదు. 

మరిన్ని వార్తలు