రాష్ట్రంలో ఆరేడు టోల్‌ప్లాజాల తొలగింపు?

26 Mar, 2022 10:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రహదారులపై కొన్ని టోల్‌ప్లాజాలను మూసివేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 60 కి.మీ., అంతకంటే తక్కువ దూరంలో టోల్‌గేట్లు ఉంటే ఒకదాన్ని మూసేయనున్నట్లు ఇటీవల కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో జాతీయ రహదారులపై 29 టోల్‌గేట్లున్నాయి. కేంద్రం నిర్ణయం మేరకు పంతంగి, రాయ్‌కల్, కొత్తగూడెం, మన్ననూరు, గుమ్మడిదల, గూడూరు, కడ్తాల్‌ టోల్‌ప్లాజాలను తొలగించాల్సి ఉంటుంది.

అయితే ఏవేవి మూసేస్తారన్న విషయంపై స్పష్టత ఇవ్వలేమని, దేశం మొత్తం యూనిట్‌గా ఢిల్లీలోని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు నిర్ణయం తీసుకుంటారని ఎన్‌హెచ్‌ఏఐ స్థానిక ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. పక్క రాష్ట్రంలోని చివరి టోల్‌ప్లాజా, మన రాష్ట్రంలోని ఆ రూట్‌లో మొదటి టోల్‌ప్లాజాల మధ్య 60 కి.మీ. దూరంలేని పక్షంలో ఒకదాన్ని తొలగించాలి. ఆ లెక్కన రాష్ట్రంలోని టోల్‌ప్లాజాలు, పొరుగున ఉన్న కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలోని టోల్‌బూత్‌లతో కలిపి చూసి నిర్ణయం తీసుకుంటారని పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా, పీపీపీ పద్ధతిలో రోడ్ల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్, పెట్టుబడి మొత్తాన్ని వడ్డీతో కలుపుకొని టోల్‌ రూపంలో వసూలుకు అనుమతి ఉంటుంది. ఇప్పుడు వాటిని ఎత్తేస్తే, కాంట్రాక్టర్‌ నష్టపోయే మొత్తాన్ని కేంద్రం చెల్లించాలి. ఈ విషయంలో ఎలాంటి విధివిధానాలను అనుసరిస్తారనే దానిపై అధికారుల్లో ఇంకా స్పష్టత రాకపోవడం విశేషం. ఢిల్లీ నుంచి తమకు ఎలాంటి మార్గదర్శకాలు అందలేదని స్థానిక 
అధికారులు పేర్కొంటున్నారు. 

(చదవండి: దివ్యాంగులు ఐపీఎస్‌కు అర్హులే..)

మరిన్ని వార్తలు