‘ఈ విచారణలేందుకు.. వీలైతే నేరుగా అరెస్ట్‌ చేయండి’.. జార్ఖండ్‌ సీఎం సవాల్‌

3 Nov, 2022 15:36 IST|Sakshi

రాంచీ: ‘నేను తప్పు చేసినట్లయితే, ఈ ప్రశ్నించటాలేంటి? నేరుగా వచ్చి అరెస్ట్‌ చేయండి.’ అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు జార్ఖాండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌. బొగ్గు కుంభకోణం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక ట్రైబల్‌ ముఖ్యమంత్రిని వేధింపులకు గురిచేసే కార్యక్రమంలో భాగంగానే ఈడీ సమన్లు జారీ చేసినట్లు ఆరోపించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.  

‘నాకు ఛత్తీస్‌గఢ్‌లో కార్యక్రమంలో ఉన్న క్రమంలో ఈరోజు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. నేను పెద్ద నేరం చేసినట్లు అయితే, రండి, నన్ను అరెస్ట్‌ చేయండి. ఈ ప్రశ్నించటాలేందుకు?. ఈడీ ఆఫీస్‌ వద్ద భద్రత పెంచారు. జార్ఖండ్‌ ప్రజలను చూసి ఎందుకు భయపడుతున్నారు?. అధికార బీజేపీని వ్యతరేకిస్తున్న వారి గొంతు నొక్కేందుకు రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయటమే ఇది. ఈ కుట్రకు తగిన సమాధానం లభిస్తుంది.’అని పేర్కొన్నారు సీఎం హేమంత్‌ సోరెన్‌. రాంచీలోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో ఈరోజు విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ వెళ్లకుండా జార్ఖండ్‌ ముక్తి మోర్చా పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.

అంతకు ముందు బీజేపీ పేరు చెప్పకుండానే ట్విటర్‌ వేదికగా పరోక్ష విమర్శలు చేశారు సీఎం. ‘నన్ను వేధించేందుకు జరుగుతున్న ఈ దాడుల వెనుక అసలు కుట్ర ట్రైబల్స్‌, వెనకబడినవారు, మైనారిటీల హక్కులను కాలరాసేందుకే. నాకు రాష్ట్రంలోని కోట్లాది మంది ప్రజల మద్దతు ఉన్నంత వరకు వారి కుట్రల్లోనే ఏ ఒక్కటి ఫలించదు.’అని పేర్కొన్నారు. బొగ్గు మైనింగ్‌ కుంభకోణం కేసులో ఇప్పటికే ఆయన సన్నిహితుడు పంకజ్‌ మిశ్రా సహా మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్‌ చేసింది ఈడీ. జులైలో దాడులు నిర్వహించి మిశ్రా బ్యాంకు ఖాతాల్లోని రూ.11.88 కోట్లు సీజ్‌ చేసింది. అలాగే ఆయన ఇంట్లో రూ.5.34 కోట్ల అక్రమ నగదు లభించినట్లు వెల్లడించింది.

ఇదీ చదవండి: Hemant Soren: జార్ఖండ్‌ సీఎంకు ఈడీ నోటీసులు.. విచారణకు రావాలని ఆదేశం

మరిన్ని వార్తలు