సీఎం మమతాకు అరెస్టయిన మంత్రి మూడుసార్లు ఫోన్.. కానీ..

25 Jul, 2022 17:27 IST|Sakshi

కోల్‌కతా: పాఠశాల ఉద్యోగాల కుంభకోణం కేసులో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ అరెస్టు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. పాఠశాల ఉద్యోగాల విషయంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో శనివారం అరెస్టయిన మంత్రి.. తమ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి మూడు సార్లు ఫోన్ చేశారు. ఫోన్ చేయటం వరకు బాగానే ఉన్నా... ఆయన చేసిన కాల్స్‌కు మమత ఎలాంటి స్పందన ఇవ్వకపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.తాము అరెస్టయిన సమాచారాన్ని కుటుంబసభ్యులకు గానీ.. స్నేహితులకు గానీ తెలియజేసేందుకు ఫోన్ చేసే అవకాశాన్ని నిందితులకు పోలీసులు కల్పిస్తారు.

ఈ అవకాశాన్ని అందుకున్న డెబ్బై ఏళ్ల పార్థ ఛటర్జీ.. తమ అధినేత్రి మమతాబెనర్జీకి మూడుమార్లు ఫోన్ చేసినట్టు అరెస్ట్ మెమోలో పోలీస్ అధికారులు వెల్లడించారు. అర్ధరాత్రి  55 నిమిషాల సమయంలో మంత్రి అరెస్టు కాగా.. 2 గంటల 33 నిమిషాలకు మొదటి కాల్ చేశారు. కానీ.. ఆ సమయంలో మమతా ఆ కాల్‌కు స‍్పందించలేదు. ఆ తర్వాత.. వేకువజామున 3 గంటల 37 నిమిషాలకు కూడా ఫోన్ చేయగా.. మమత నుంచి మళ్లీ ఎలాంటి స్పందన లభించలేదు.  తిరిగి.. ఉదయం 9 గంటల 35 నిమిషాలకు మరోసారి ఫోన్ చేసినా పార్థ ఛటర్జీకి నిరాశే ఎదురైంది. ఈ విషయాన్ని అరెస్టు మెమోలో పోలీసున్నతాధికారులు పేర్కొన్నారు.
చదవండి: కుక్కల కోసం లగ్జరీ ఫ్లాట్.. పార్థ చటర్జీ ఈడీ విచారణలో షాకింగ్ విషయాలు

అయితే ఈ విషయాన్ని తృణముల్ కాంగ్రెస్ కొట్టిపారేసింది. అరెస్టయిన మంత్రి సీఎం మమతాబెనర్జీకి ఫోన్ చేసే ప్రసక్తేలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. మొబైల్ ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నప్పుడు.. సీఎంకు ఫోన్ ఎలా చేయగలరని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఏయిడెడ్ పాఠశాలల్లో.. ఉపాధ్యాయుల నియామకాల్లో అవినీతికి పాల్పడ్డట్టు మంత్రిపై అభియోగం ఉంది.దీంతో ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో ఆయన నివాసంలో సుమారు 20 కోట్ల నగదు లభించగా.. మంత్రిని ఈడీ కస్టడీలోకి తీసుకుంది.

ఆ తర్వాత.. మంత్రి అనారోగ్యానికి గురికావటంతో.. ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణించటంతో.. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు మంత్రి పార్థ ఛటర్జీని ఈరోజు ఉదయం ఎయిర్ అంబులెన్స్‌లో భువనేశ్వర్‌లోని ఏయిమ్స్‌కు తరలించారు. కాగా.. దృశ్య మాధ్యమం ద్వారా విచారణకు హాజరుకావాలని మంత్రికి న్యాయస్థానం తెలిపింది.

మరిన్ని వార్తలు