Arshdeep Singh: అర్షదీప్ సింగ్‌ వ్యవహారం.. తీవ్రంగా స్పందించిన కేంద్రం. వికీపీడీయాకు సమన్లు

5 Sep, 2022 15:44 IST|Sakshi

టీమిండియా బౌలర్ అర్షదీప్ సింగ్‌పై కొందరు టీమిండియా ఫ్యాన్స్‌ తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆదివారం పాక్‌తో మ్యాచ్‌ సందర్భంగా.. మ్యాచ్‌ను మలుపు తిప్పే కీలకమైన క్యాచ్‌ను వదిలేశాడంటూ అర్షదీప్‌ను తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో విరాట్‌ కోహ్లీతో పాటు పలువురు ఆటగాళ్లు, మాజీల మద్దతు అతనికి లభిస్తోంది. అయితే.. 

అర్షదీప్ సింగ్‌ వ్యవహారంలో అనుచితమైన చేష్టలకు పాల్పడుతున్నారు కొందరు. అతనిపై దాడి చేస్తామని, చంపేస్తామని కొందరు బైకులపై తిరుగుతూ గోల చేయడం తెలిసిందే. తాజాగా అతనికి నిషేధిత సంస్థ ఖలీస్తానీతో సంబంధం ఉందంటూ తప్పుడు సమాచారం వైరల్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా.. అతని వికీపీడియా పేజీలో భారత్‌ స్థానంలో ఖలిస్తాన్ అంటూ ఎడిట్‌ చేయడం తీవ్ర దుమారం రేపింది. 

అయితే.. ఈ వ్యవహారంపై కేంద్రం సీరియస్‌ అయ్యింది. వికీపీడియా పేజీలో చోటు చేసుకున్న తప్పుడు సమాచారం వల్ల మత సామరస్యం దెబ్బతింటుందని, పైగా అర్షదీప్‌ కుటుంబ సభ్యులకు ముప్పు ఏర్పడుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై వికీపీడియా భారత ఎగ్జిక్యూటివ్‌లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సమన్లు జారీ చేసింది. తప్పుడు సమాచారం ఎలా ప్రచురితమైందో వివరణ ఇవ్వాలని అందులో కోరింది.

ఇదిలా ఉంటే.. అర్షదీప్‌ వికీపీడియా పేజీలో భారత్‌ అని ఉన్న చోట.. ఖలిస్తాన్‌ అని జత చేశారు. అది అన్‌రిజిస్టర్డ్‌ అకౌంట్‌ నుంచి జత అయినట్లు తెలుస్తోంది. అయితే.. 15 నిమిషాలోపే వికీపీడియా ఎడిటర్స్‌ ప్రొఫైల్‌ను సవరించారు. 

ఆసియాకప్ సూపర్-4లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి పాలైన తర్వాత అర్షదీప్ సింగ్‌పై కొందరు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మ్యాచ్లో భాగంగా 18వ ఓవర్‌లో మూడో బంతికి రవి బిష్ణోయ్‌ వేసిన బంతిని అసిఫ్‌ అలీ స్వీప్‌ షాట్‌ అడగా.. సలువైన క్యాచ్‌ను అర్షదీప్‌ జారవిడిచాడనే విమర్శ చెలరేగింది. అయితే.. ఉత్కంఠభరితమైన చివరి ఓవర్‌లో అర్షదీప్‌ సింగ్ పరుగుల కట్టడికి  ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో అర్షదీప్‌కు విపరీతమైన మద్దతు లభిస్తోంది. 

ఇదీ చదవండి:  చిన్న పొరపాట్లే మిస్త్రీ ప్రాణాలు తీశాయా?

మరిన్ని వార్తలు