కాలుష్యం తగ్గించడానికి కృత్రిమ వర్షం? ఢిల్లీ ప్రభుత్వం సరికొత్త ప్లాన్‌

9 Nov, 2023 09:43 IST|Sakshi

ఢిల్లీ: ఢిల్లీలో వాయు నాణ్యత అడుగంటిపోతోంది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం, వాహన ఉద్గారాల వల్ల గత ఏడు రోజులుగా కాలుష్య స్థాయిలు విషమంగానే కొనసాగుతున్నాయి. గాలి నాణ్యత పెంచడానికి తక్షణ ఉపాయం ఆలోచించాలని సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. నవంబర్ 20-21లో రెండు రోజుల పాటు ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించాలని యోచిస్తోంది.

ఐఐటీ కాన్పూర్ బృందంతో ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్, ఆర్థిక మంత్రి అతిషి సమావేశమయ్యారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి కృత్రిమ వర్షం కురిపించవచ్చని ప్రతిపాదించారు. కృత్రిమ వర్షానికి సంబంధించిన ప్రణాళికను ఢిల్లీ ప్రభుత్వం ఐఐటీ కాన్పూర్ నిపుణులను కోరింది. ఈ ప్రణాళికను సుప్రీంకోర్టులో శుక్రవారం  సమర్పించనుంది. 

ఢిల్లీలో కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. సర్వోన్నత న్యాయస్థానం ఆమోదముద్ర వేస్తే ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం ఈ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాయి.

"కృత్రిమ వర్షం కురిపించాలంటే కనీసం 40 శాతం మేఘాలు కమ్ముకోవాలి. నవంబర్ 20-21 తేదీల్లో మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. కృత్రిమ వర్షం ప్రణాళికను అమలు చేసేందుకు అనుమతి లభిస్తే అధ్యయనాన్ని నిర్వహిస్తాం' అని ఐఐటీ కాన్పూర్ నిపుణులు తెలిపారు. 

దేశ రాజధానిలో గాలి కాలుష్యం రాజకీయ వివాదంగా పరిణమించకూడదని సుప్రీంకోర్టు ఇటీవల హెచ్చరించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో పంట వ్యర్థాల దహనాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. కాలుష్య సమస్యను ఢిల్లీ ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని కోరింది.

కృత్రిమ వర్షం అంటే?
కరువుల ప్రభావాన్ని తగ్గించడం, అటవీ మంటలను నివారించడం, గాలి నాణ్యతను పెంచడానికి సాధారణంగా ఉపయోగించే కృత్రిమ పద్ధతి. వివిధ రసాయనిక పదార్థాలను మేఘాలలోకి ప్రవేశపెట్టడం ద్వారా వర్షపాతాన్ని కలిగిస్తారు. సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్ వంటి రసాయనాలను హెలికాప్టర్ల ద్వారా మేఘాలలోకి విడుదల చేస్తారు. ఈ రసాయనాలు నీటి ఆవిరిని మేఘాలుగా ఏర్పర్చి వర్షం కురిసేలా చేస్తాయి.

ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యానికి రీజనరేటివ్ వ్యవసాయమే విరుగుడు..? అసలేంటది..?

మరిన్ని వార్తలు