భారత పౌరులను కిడ్నాప్‌ చేసిన చైనా ఆర్మీ!

5 Sep, 2020 13:12 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది. తమ రాష్ట్రంలోని సుబన్‌సిరి జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులను చైనా ఆర్మీ అపహరించిందని ఎమ్మెల్యే నినాంగ్‌ ఎరింగ్‌ ట్విటర్‌లో పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని అరుణాచల్‌ టైమ్స్‌ వార్తా సంస్థ కూడా ట్విటర్‌లో పేర్కొనడం గమనార్హం. మరోవైపు ఐదు నెలల క్రితం కూడా ఇలాంటి ఘటనే జరిగిందని ఎమ్మెల్యే ఎరింగ్‌ వెల్లడించారు. మార్చి 19న సుబన్‌సిరి జిల్లా ఎగువ ప్రాంతంలోని మెక్‌మోహన్‌ రేఖకు సమీపంలో 21 ఏళ్ల వ్యక్తిని చైనా ఆర్మీ అపహరిందని తెలిపారు. 

ఇక తాజాగా కిడ్నాప్‌నకు గురైన వారి వివరాలతో కూడిన స్క్రీన్‌ షాట్‌ను కూడా ఎమ్మెల్యే ఎరింగ్‌ షేర్‌ చేశారు. అయితే, ఈ ఘటన జరిగిందెప్పుడన్నది మాత్రం ఎమ్మెల్యే చెప్పలేదు. కిడ్నాప్‌ ఘటనపై చైనా స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, తూర్పు లద్దాఖ్‌లో యథాతథ స్థితిని చెడగొట్టిన చైనా ప్యాంగ్యాంగ్‌ సరస్సు తీరంలోని భూభాగంలోకి చొరబడదామనుకున్న యత్నాలను భారత్‌ సమర్థంగా ఎదుర్కున్న సంగతి తెలిసిందే. దాంతోపాటు భారత దళాలు రక్షణపరంగా కీలకమై స్థావరాలకు చేరుకుని చైనాపై పైచేయి సాధించాయి. దీంతో భారత్‌ చర్యలను చైనా ఖండించగా.. నియంత్రణ రేఖను దాటిపోలేదని భారత్‌ సమాధానమిచ్చింది. ఇదిలాఉండగా.. ఇరు దేశాల రక్షణశాఖ మంత్రులు మాస్కోలో నేడు సమావేశమయ్యారు.
(చదవండి: చైనా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్‌ సింగ్‌ భేటీ)

మరిన్ని వార్తలు