‘బ్రాహ్మణిజం.. బ్రాహ్మణుల గురించి కాదు’

5 Sep, 2020 14:32 IST|Sakshi

బ్రాహ్మణిజంపై వ్యాఖ్యలు.. తీవ్ర స్థాయిలో విమర్శలు

న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత్రి, బుకర్‌ ప్రైజ్‌ గ్రహీత అరుంధతి రాయ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్రాహ్మణిజం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో కులరహిత సమాజాన్ని ఆకాంక్షించే మేధావులు అరుంధతి తీరును తప్పుబడుతున్నారు. ‘‘ఆజాదీ: ఫ్రీడం, ఫాసిజం, ఫిక్షన్‌’’పేరిట అరుంధతి రాయ్‌ రచించిన కొత్త పుస్తకం విడుదల సందర్భంగా యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ మెక్సికో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిక్‌ ఎజ్‌ వీడియో కాన్పరెన్స్‌తో ద్వారా ఆమెను ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో భారత్‌లో ఉన్న కుల వ్యవస్థను, అమెరికాలోని జాతి వివక్ష భావనలను ఒకే విధంగా చూస్తారా అని ప్రశ్నించారు. (చదవండి: ‘మనం బుల్లెట్లు ఎదుర్కోవడానికి పుట్టలేదు’)

అదే విధంగా తన తల్లిదండ్రుల మతతత్వ గుర్తింపు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘మిమ్మల్ని మీరు బ్రాహ్మిణ్‌ అనుకుంటున్నారా’’అని ప్రశ్నలు సంధించారు. ఇందుకు స్పందించిన అరుంధతీ రాయ్‌.. ‘‘మా అమ్మ క్రిస్టియన్‌. మా నాన్న బ్రహ్మ సమాజంలో సభ్యులు. అంతేగానీ ఆయన బ్రాహ్మిణ్‌ కాదు. నిజానికి తర్వాత ఆయన క్రిస్టియన్‌గా మారిపోయారు. ఇక కుల వ్యతిరేక ఉద్యమం అనగానే అందరూ బ్రాహ్మణిజం  అనే పదాన్ని వాడుతూ ఉంటారు. అయితే బ్రాహ్మణుల గురించి కాదు. కుల వ్యవస్థ గురించి మాట్లాడే వారు ఈ పదాన్ని వాడతారు. కాబట్టి బ్రాహ్మణిజం పాటించే బ్రాహ్మణుల గురించి మాత్రమే కాదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక జాతి వివక్ష గురించి మాట్లాడాల్సి వస్తే.. కులం ఓ వ్యక్తికి తమకిష్టమైన మతాన్ని పాటించే అవకాశం ఇచ్చింది’’ అని చెప్పుకొచ్చారు. (చదవండి: మైనారిటీలు మారారు.. గుర్తించారా?)

ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన పలువురు మేధావులు అరుంధతి వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. ‘‘బ్రాహ్మణిజం బ్రాహ్మణుల గురించి కాదని అరుంధతి రాయ్‌ చెబుతున్నారు. మరి బ్రాహ్మణిజం అంటే ఏమిటి? కుల వ్యవస్థను నిర్వచించడానికి ఇంతకంటే మంచి పదం ఉంటే మీరే సూచించండి’’ అని తేజస్‌ హరాద్‌ అనే నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. ‘‘తను బ్రాహ్మిణ్‌ కాదంటూ అరుంధతి రాయ్‌ అబద్ధాలు చెబుతున్నారు. ఆమె హావభావాలు, గొంతు మారిన విధానం ఎవరైనా గమనించారా? నయ వంచనకు పరాకాష్ట’’ అంటూ మరొకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అరుంధతి నిజంగానే బ్రాహ్మిణ మహిళా?
చాలా మంది అరుంధతిని బ్రాహ్మిణ్‌ అంటూ ఉంటారు. అయితే తాను బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన దానిని కాదని, తన తండ్రి బ్రహ్మ సమాజం సభ్యుడని, తన తల్లి మలయాళీ సిరియన్‌ క్రిస్టియన్‌ అని గతంలో అనేకసార్లు చెప్పారు. అయినప్పటికీ ఆమెపై విమర్శలు మాత్రం ఆగడం లేదు.

మరిన్ని వార్తలు