ఢిల్లీలో కేజ్రీవాల్‌ బలప్రదర్శన

26 Aug, 2022 04:05 IST|Sakshi

ఆమ్‌ ఆద్మీ పార్టీ సమావేశానికి 53 మంది ఎమ్మెల్యేల హాజరు

40 మంది ఎమ్మెల్యేలపై బీజేపీ కన్ను

రూ.800 కోట్లు ఖర్చు చేసేందుకు బీజేపీ సిద్ధం

ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ఆరోపణ

న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాదిరి అధికార పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నం చేసిందంటూ, ఢిల్లీలో అది అసాధ్యమని ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ పరోక్షంగా ఎమ్మెల్యేలతో బల ప్రదర్శన చేశారు. గురువారం ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశంలో 62 మంది ఎమ్మెల్యేలకుగాను 53 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మిగతా తొమ్మిది మందీ తనకు నిరంతరం ‘టచ్‌’లోనే ఉంటారంటూ ఢిల్లీ సర్కార్‌ను ఎవరూ పడగొట్టలేరని కేజ్రీవాల్‌ స్పష్టంచేశారు.

పార్టీ ఎమ్మెల్యేల సమావేశం కొద్ది నిమిషాల్లోనే ముగించారు. తర్వాత కేజ్రీవాల్‌సహా అందరూ గాంధీజీ స్మారకం రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. ఆప్‌ ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకునే బీజేపీ ‘ఆపరేషన్‌ కమల్‌’ వైఫల్యానికి గుర్తుగా రాజ్‌ఘాట్‌ వద్ద ప్రార్థనలు చేశామని చెప్పారు. దేశ పురోభివృద్ధి, శాంతిభద్రతల మెరుగు కోసం ప్రార్థనలు చేశామని సీఎం కేజ్రీవాల్‌ చెప్పారు. కొద్ది రోజులుగా సీఎంతో సత్సంబంధాలు లేని 12 మంది ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్‌ విస్తృతస్థాయిలో మంతనాలు జరుపుతారని ఆప్‌లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 

ఆ రూ.800 కోట్లు ఎక్కడివి?: కేజ్రీవాల్‌
తన ఇంట్లో ఎమ్మెల్యేలతో భేటీ తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ మాట్లాడారు. ‘బీజేపీలో చేరితే చెరో రూ.20 కోట్లు ఇస్తామని 40 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను బీజేపీ మభ్యపెట్టింది. ఎమ్మెల్యేలను గంపగుత్తగా కొనేందుకు బీజేపీ రూ.800 కోట్లు ఖర్చుచేసేందుకు సిద్ధమైంది. అంతటి డబ్బు బీజేపీకి ఎక్కడిది? దేశ పౌరులకు బీజేపీ సమాధానం చెప్పాల్సిందే. ఎప్పటికప్పుడు పెంచుతూపోయిన వస్తుసేవల పన్ను(జీఎస్టీ) నుంచి ఆ డబ్బు తెచ్చారా? లేకుంటే పీఎం కేర్స్‌ ఫండ్‌ నగదా?. లేదంటే ఆప్త మిత్రులు ఇచ్చారా? ’ అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. తమతో చేయి కలిపితే నీపై మోపిన సీబీఐ, ఈడీ కేసులను మాఫీ చేస్తామని, సీఎంను చేస్తామని మనీశ్‌ సిసోడియాకు బీజేపీ భారీ ఆఫర్‌ ఇచ్చిందని కేజ్రీవాల్‌ గుర్తుచేశారు.

‘ బీజేపీ భారీస్థాయిలో డబ్బాశ చూపినా ఆప్‌ సుపరిపాలన ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు మద్దతుగా నిల్చున్నారు. తలలు తెగినా సరే వారెవరికీ అమ్ముడుపోరు’ అని అన్నారు. ఢిల్లీ ఎక్సయిజ్‌ పాలసీలో అవినీతి జరిగిందన్న ఆరోపణపై కేజ్రీవాల్‌ కొట్టిపారేశారు. ఢిల్లీ ఎక్సయిజ్‌ పాలసీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఆప్‌ చేస్తున్న కొత్త స్టంట్‌ ఇది అని బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ వ్యాఖ్యానించారు. ఆప్‌ నాటకాల్లో ఆరితేరిందని,  ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు చేస్తూ ఒక సినిమా స్క్రిప్ట్‌ను చూపిస్తోందన్నారు. ఆప్‌ ఎమ్మెల్యేల రాకతో రాజ్‌ఘాట్‌ అపవిత్రమైందంటూ ఆ తర్వాత బీజేపీ నేతలు శుద్ధిచేస్తామంటూ అక్కడ గంగాజలం చల్లారు. మరోవైపు ఢిల్లీ రాష్ట్ర మంత్రులను లక్ష్యంగా చేసుకుని ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థల దాడులపై చర్చించేందుకు శుక్రవారం ఢిల్లీ శాసనసభ ప్రత్యేకంగా సమావేశంకానుంది.

మరిన్ని వార్తలు